iDreamPost
android-app
ios-app

చతురత – వాగ్ధాటి – అనుభవం అన్నీ కలిసి రోశయ్య

  • Published Jul 04, 2020 | 4:45 PM Updated Updated Jul 04, 2020 | 4:45 PM
చతురత – వాగ్ధాటి – అనుభవం అన్నీ కలిసి రోశయ్య

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం , రాజకీయల్లో తలపండిన నేతగా గుర్తింపు, రాష్ట్రంలో దీర్ఘ కాలంపాటు ఆర్ధిక శాఖను ఒంటి చేత్తో నడిపిన నేర్పరితనం, ప్రత్యర్ధులపై చమత్కారాలతో ఇరుకున పెట్టే నైపుణ్యం, రాజకీయల్లో ఉద్దండుడిగా గుర్తింపు ఇలా అనేక కోణాల్లో ఒక రాజకీయ నేతకు గుర్తింపు రావడం అరుదుగా చెబుతారు. కానీ సామాన్యుడిగా మొదలై అసామాన్యుడుగా రాజకీయల్లో ఎదిగిన మాజీ ముఖ్యమంత్రి గా కన్నా మాజీ ఆర్ధిక మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొణిజేటి రోశయ్య గారి రాజకీయ ప్రస్థానానికి 60 ఏళ్లు …

గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించిన రోశయ్య , 5వ తరగతి వరకు వేమూరు లో, ఆతరువాత పక్కనే ఉన్న పేరవలిలో 8వ తరగతి వరకు… కొల్లూరులో 10వ తరగతి వరకు చదువుకున్నారు. కొల్లూరులో చదువుకునే రోజుల్లోనే నాదెండ్ల భాస్కరరావు, ఆలపాటి ధర్మారావు లాంటి వారు తనకు తోటి విధ్యార్ధులుగా ఉండటంతో వారితో స్నేహం ఏర్పడింది. ఆ తరువాత గుంటూరు పున్నారావు వైశ్య హాస్టల్ లో ఉంటు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారు.

గుంటూరులోని హిందూ కాలేజిలో చదువుతున్న రోజుల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం జరుగుతున్న సంధర్భంలో రాజకీయాల వైపు మొగ్గు చూపిన రోశయ్య విద్యార్ధి నాయకుడిగా ఎదిగారు. ఆ సమయంలోనే సహచర విద్యార్ధులతో కలిసి ఆంద్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాలలో పలు సభలకి వెళ్లేవారు. ఇదే సమయంలో రోశయ్య మద్రాసు వెళ్ళి నిరసన దీక్షలో ఉన్న పొట్టి శ్రీరాములను కూడా కలిసి వచ్చారు, ఈ దశలోనే రోశయ్యకు గౌతు లచ్చన్న , కందుల ఓబుల్ రెడ్డి లాంటి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ఎన్ జీ రంగా, ప్రకాశం పంతులు తోకూడా కాస్త చనువు ఏర్పడింది.

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా ప్రతి వేసవి కాలంలో నిర్వహించే రైతు సదస్సులుకు హాజరయి అక్కడ వక్తగా రోశయ్య వ్యవహరించడంతో అనతికాలంలోనే రంగాకి శిష్యులుగా మారారు. 1959లో స్వతంత్ర పార్టీ ఆవిర్భావంలో రంగాతోపాటు రోశయ్య కూడా పాలుపంచుకున్నారు.

ముప్పై ఏళ్ళ వయస్సులోనే రోశయ్య తొలిసారి 1962 ఎన్నికల్లో తెనాలి శాసనసభకు స్వతంత్ర పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత ఆలపాటి వెంకటరామయ్య ఆ ఎన్నికల్లో గెలిచారు..

రెండవ ప్రయత్నంలో 1967 ఎన్నికల్లో చీరాల నుండి ఇండిపెండెంట్ గా పొటీకి దిగి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యరు. ఆ తరువాత 1968లో స్వతంత్ర పార్టీకి ఏడుగురే శాసన సభ్యులున్నా గౌతు లచ్చన్న తోడ్పాటుతో శాసన మండలి బరిలోకి దిగిన రోశయ్యకు కాంగ్రెస్ శాసన సభ్యులతో మంచి సంబందాలు ఉండటం తో అప్పటి కాంగ్రెస్ శాసన సభ్యులు ద్వితీయ ప్రాధాన్యతా ఓటు రోశయ్యకు వేయడానికి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి సలహా కోరగా ఆయన ఒప్పుకున్నారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలై రోశయ్య ఎన్నికవడం జరిగింది.. రోశయ్యతో పాటు కాసు వెంగళ రెడ్డి, తోటా రామస్వామి లాంటి ఉద్దండులు కూడా ఆ ఎన్నికల్లో గెలిచారు.

Also Read: దేవినేని సోదరుల రాజకీయ ప్రస్థానం

1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ లోకి వచ్చిన రోశయ్య, 1974 వచ్చేసరికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావుకి సన్నిహితంగా మారారు, ఆ తరువాత జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జలగం వెంగళ రావు ఎంత ప్రయత్నించిన రోశయ్యకు టిక్కెట్ట్ ఇప్పించుకోలేకపోయే సరికి ఇండిపెండెంట్ గా పోటీలోకి దిగి వెంగళరావు మరికొంత మంది సభ్యుల సహకారంతో తిరిగి మండలికి ఎన్నికయ్యరు. ఆ తరువాత జలగం తో పెరిగిన సాన్నిహిత్యంతో ఆయనకు ఏపిఐఐసి చైర్మన్, పిసిసి ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి.

1978లో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన నేపధ్యంలో ప్రజలందరూ ఇందిరా గాంధి వైపే మొగ్గు చూపుతున్నారు అని తెలిసినప్పటికి కాసు బ్రహ్మనందరెడ్డి, జలగం వెంగళరావు పైన తనకున్న గౌరవంతో కాంగ్రెస్ (ఆర్) లోనే ఉండిపోయారు. అయితే 1978లో ఇందిరా కాంగ్రెస్ తరుపున చెన్నారెడ్డి ముఖ్యామంత్రి అవ్వగా శాసన మండలిలో రోశయ్య ప్రతిపక్షనేత పాత్ర పోషించారు. అప్పుడు రోశయ్య మండలిలో చెన్నరెడ్డిని అనేక విషయాల్లో తన వాగ్దాటితో ఇరుకున పెట్టగా , హోమ్ మంత్రి హషీం ముందుగానే రోశయ్య దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టవద్దు అని బ్రతిమిలాడేవారు.

ఆ తరువాత చెన్నారెడ్డి రోశయ్యను తమ పార్టీ లోకి రమ్మని ఆహ్వానించగా తన రాజకీయ భవిష్యత్తు కోసం మండలిలో ప్రతిపక్షనేత గా ఉంటూనే 1979 మేలో కాంగ్రెస్ (ఐ) లో చేరిపోయారు. ఆనాటి రాజకీయాల్లో ఈ పరిణమం తీవ్ర దుమారమే రేపింది. ఈ చేరికతో రోశయ్యకు చెన్నారెడ్డి కెబినేట్ లో రహదారులు భవనాల శాఖ మంత్రిపదవి దక్కడంతో ఆయన రాజకీయ ప్రస్థానంలో అదొక కీలక పరిణామంగా నమోదైంది . ఆ తరువాత అంజియ్య కేబినెట్ లో హౌసింగ్ , రవాణా శాఖలకి మంత్రిగా వ్యవహరించారు రోశయ్య.

1983లో రాష్ట్రంలో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. ఎన్.టి.ఆర్ ముఖ్యమంత్రి గా ఉండగా శాసన మండలి లో విపక్ష నేతగా రోశయ్య ఉండేవారు. అయితే ఎన్.టి.ఆర్ మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో 1989 వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కోశాధికారిగా, అధికార ప్రతినిధిగా, కార్యదర్శిగా భాద్యతలు నిర్వహంచారు. 1989 ఎన్నికల్లో చీరాల నుండి శాసన సభకు పోటీ చేసిన రోశయ్య చెన్నరెడ్డి కేబినెట్ లో ఆర్ధిక , ప్రణాళిక, విద్యుత్, ఉన్నత విద్యా చేనేత జౌళి శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనర్ధన్ రెడ్డ, కోట్ల విజయ బాస్కర్ రెడ్డి, క్యాబినెట్ లో కూడా అర్ధిక శాఖతో పాటు వివిద శాఖలకు మంత్రిగా పనిచేశారు.

Also Read: 40 వసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ జనతా పార్టీ

అయితే 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి పాలవడం కేవలం 26 సీట్లకే పరిమితం అవ్వడంతో ఆ ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసిన రోశయ్య కూడ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యరు. ఆ తరువాత 1995లో పిసిసి కి అధ్యక్షుడిగా భాద్యతలు నిర్వహించారు . 1998లో మద్యంతర ఎన్నికలు రావడంతో నర్సరావు పేట పార్లమెంట్ స్థానం నుండి దిగిన రోశయ్య తెలుగుదేశం అభ్యర్ధి కోట సైదయ్యపై విజయం సాదించారు.

అయితే ఆ లోక్ సభ 1999 నాటికే రద్దు అయిపోయి మళ్ళి ఎన్నికలు రావడంతో ఈ సారి రోశయ్య తెనాలి నుండి శాసన సభకు పోటీ చేశారు. అయితే రోశయ్య లాంటి వాగ్దాటి కలిగిన ఉద్దండుడు అశంబ్లీ లో ఉంటే తనకు కష్టం అని భావించిన చంద్రబాబు తెనాలి లోనే మకాం పెట్టి రోశయ్య ఓటమికి కృషి చేసి సఫలీకృతం అయ్యారు. స్వల్ప తేడాతో ఓటమి పాలైనా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మరుసటి రోజే రోశయ్య గాంధీ భవన్ లో ప్రత్యక్షం అవ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇక రోశయ్యకు దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర రెడ్డితో ఉన్న బంధం ప్రత్యకమైందనే చెప్పాలి , కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపు తగాదాలు ఉన్న , ఎన్ని వర్గాలు ఉన్న ఆ ప్రభావం వై.యస్.ఆర్ , రోశయ్య మధ్య ఉన్న బంధం పై పడలేదనే చెపాలి. వై.యస్.ఆర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా విజయభాస్కర్ రెడ్డి ప్రోద్బలంతో రోశయ్య ప్రధానిగా ఉన్న పివి నరసింహ రావుకు లేఖ ఇచ్చిన , ఆ ఘటనను వై.యస్ పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. రోశయ్య స్వభావం తెలిసిన వై.యస్ ఆ పిర్యాదు ఎవరి ప్రోద్బలంతో చేశారో గ్రహించినా ఏనాడు రోశయ్యని వేరుగా చూడలేదనే చెప్పాలి .

వై.యస్ 1999లో ప్రతిపక్షనేత గా ఉన్నప్పుడు శాసన సభలో చర్చించాల్సిన అనేక అంశాల పై వీరిరువురూ గంటల తరబడి చర్చించి ప్రధాన పక్షాన్ని ఇరుకున పెట్టే వారు. 2004లో వై.యస్ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చీరాల నుండి పోటీ చేసి ఘన విజయం సాదించిన రోశయ్య వై.యస్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా భాద్యతలు చేపట్టి శాసన సభలో నెంబర్ 2గా వ్యవహరించి వై.యస్ ఆర్ కు అండగా నిలబడి తన వాగ్దాటితో ప్రతిపక్షానికి చమటలు పట్టించిన నేర్పరిగా గుర్తింపు పొందారు.

ఒకానొక సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీలో రోశయ్యను ఉద్దేసించి మీకు ఈ మద్య తెలివితేటలు ఎక్కువ అయ్యాయి అని చెప్పే సరికి, రోశయ్య ప్రతి స్పందిస్తూ నాకే తెలివితేటలు ఉంటే , చెన్నా రెడ్డిని , నేదురుమల్లి జనార్ధనరెడ్డిని , అంజయ్యను , వీరి తో పాటు నన్ను నమ్మిన వై.యస్ ను ఎప్పుడో ఒంటరిగా ఉన్న సమయం చూసి వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేవాడిని అని నర్మగర్భంగా వైస్రాయి ఘటనను గుర్తు చేస్తూ సభలో చెలరేగిపోయారు రోశయ్య.

2009లో రోశయ్య తాను ఇక శాసన సభకు పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పిన మరుక్షణం వై.యస్ రోశయ్య చేత మంత్రి పదవికి శాసన సభకు రాజీనామా చేయించి మండలికి ఎంపిక చేశారు. ఆ తరువాత 2009లో ఎన్నికలలో విజయం సాదించాక రోశయ్యను వై.యస్ యదావిధిగా ఆర్ధిక మంత్రిగా కొనసాగించారు. 2009 సెప్టెంబర్ 2న వై.యస్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురై దివంగతులైన దుర్వార్తను కూడా రోశయ్యే గద్గద స్వరంతో చెప్పాల్సి వచ్చింది.

Also Read: మేకపాటి రాజకీయ ఘనాపాటి

వై.యస్ మరణానతరం అదిష్టానం ఆదేశాలమేరకు అనూహ్యమైన పరిణామాలతో ముఖ్యమంత్రి అయిన రోశయ్య ఉన్నది కొద్ది రోజులైనా అనేక ఇబ్బందుల మధ్యనే ఆ పదవిలో కొనసాగారు. చివరికి అధిష్టానం ముఖమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డిని ని ఎంపిక చేయడంతో 2011 ఆగస్టు 31న తమిళ నాడు గవర్నర్ గా వెళ్ళారు. 2014 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలై నరెంద్ర మోడి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నియమించిన గవర్నర్లను అనేక చోట్ల తొలగించి వేరే వారిని నియమిస్తే తమిళ నాడులో మాత్రం కాంగ్రెస్ వ్యక్తి అయిన రోశయ్యను మాత్రం తొలగంచకుండా కొనసాగించారు. దీనికి ప్రధాన కారణం వివాద రహితంగా తమిళనాడులో పేరు తెచ్చుకోబట్టే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మోడి సర్కార్కు రోశయ్యనే తమకు గవర్నర్ గా కొనసాగించాలని కోరినట్టు అనేక వార్తలు వచ్చాయి. 2016లో తమిళనాడు గవర్నర్ గా పదవి విరమణ చేశారు.

ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా , ఆ తరువాత ముఖ్యమంత్రిగా , గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో దురందరుడిగా పేరు గడించారు . ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 15 సార్లు బడ్జేట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆయన, నేడు 87వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ . .