iDreamPost
android-app
ios-app

ఢిల్లీకి రేవంత్.. అందుకేనంటూ మ‌రోసారి ప్ర‌చారం

ఢిల్లీకి రేవంత్.. అందుకేనంటూ మ‌రోసారి ప్ర‌చారం

చుక్కాని లేని నావ‌లా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప‌రిస్థితి. ఓ వైపు నాయ‌కులు అంద‌రూ పార్టీని వీడుతుంటే, ఇప్ప‌టికీ రాష్ట్ర కాంగ్రెస్ కు నాయ‌కుడు లేకుండా పోయాడు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టు అలా ప్రకటన వస్తుందని ఆశించడం.. తర్వాత నిరీక్షించడం అన్నట్టుగా కాంగ్రెస్ నియామకాలు ఉంటున్నాయి. కొత్త‌గా మొద‌టి నుంచి మొద‌లుపెడ‌తారంటు కూడా వార్త‌లు వ‌చ్చాయి. టీపీసీసీ చీఫ్ నియామకం జీవితకాలం లేటు అన్న చందంగా ఎప్పుడూ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటోంది. తాజాగా మరోసారి ఆ అలజడి చెలరేగింది.

ఇప్పటివరకు జరిగిన కసరత్తును పక్కన పెట్టి.. తాజాగా మరోసారి అధ్యయనం చేయాలని.. రథసారధిగా ఎవరిని నియమించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కోరినట్లు కొద్ది రోజుల క్రితం ప్ర‌చారం జ‌ర‌గింది. పెద్ద ఎత్తున నేతలు పీసీసీ చీఫ్ పదవికి పోటీ పడుతున్న వేళ.. సరైన నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. ఈ క్రమంలోనే తాజా అధ్యయనమని చెబుతున్నారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం మరోసారి దృష్టి సారించినట్టు తెలిసింది. అతి త్వరలోనే టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని.. దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత వేణుగోపాల్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకోవడం ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చినట్టైంది. టీపీసీసీ చీఫ్ నియామకాన్ని చేయబోతున్నారని.. రేవంత్ రెడ్డితో ఈ మేరకు అధిష్టానం చర్చలు జరుపుతోందని టాక్ నడుస్తోంది.