iDreamPost
android-app
ios-app

రేవంత్ కు పీసీసీ – వేడెక్క‌నున్న తెలంగాణ రాజ‌కీయం

రేవంత్ కు పీసీసీ – వేడెక్క‌నున్న తెలంగాణ రాజ‌కీయం

శాఖ‌ల వారీగా ఖాళీగా ఉన్న అధ్య‌క్ష స్థానాల‌ను భ‌ర్తీ చేస్తున్న కాంగ్రెస్.. ఏళ్ల త‌ర‌బ‌డి నానుతున్న టీపీసీసీ చీఫ్ ప‌ద‌వికి కూడా మ‌ల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ఖ‌రారు చేసిన విష‌యం తెలిసిందే. త‌మకే పీసీపీ ప‌గ్గాలు కావాలంటూ చాలామంది ఎన్నో ర‌కాలుగా ప్రయత్నాలు చేసినా, ఢిల్లీ కేంద్రంగా చ‌క్రం తిప్పిన రేవంత్ చివ‌ర‌కు అనుకున్న‌ది సాధించారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువస్తానని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం, అమర వీరుల ఆశయాల కోసం పని చేస్తానని, రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ ఆలోచన మేరకు పని చేస్తానని చెప్పుకొచ్చారు. అభిప్రాయ‌బేధాలు కాంగ్రెస్ లో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. త్వ‌ర‌లోనే సీనియ‌ర్ నాయ‌కులంద‌రినీ క‌లుస్తా, అమరవీరుల త్యాగాలకు విలువ తెచ్చేలా ప‌ని చేస్తా అని చెప్పిన రేవంత్ కేసీఆర్ పై కూడా ప‌దునైన విమ‌ర్శ‌లు చేశారు. రేవంత్ వ్యాఖ్య‌లు ఇలా ఉండ‌గా, మ‌రోవైపు పీసీసీ చీఫ్ నియామ‌కం పార్టీలో క‌ల్లోలం సృష్టిస్తోంది.

కేఎల్ ఆర్ రాజీనామా

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామ‌కాన్ని మొద‌టి నుంచీ ఓ వ‌ర్గం వ్య‌తిరేకిస్తూనే ఉంది. ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్క‌కుండా చివ‌రి వ‌ర‌కూ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఫైన‌ల్ గా రేవంత్ చీఫ్ అయ్యాక వారిలో కొంద‌రు సైలెన్స్ గా ఉండ‌గా, మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాల ప‌ర్వం కూడా మొద‌లైంది. ఈ ప‌రిణామాల‌తో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నో రోజులుగా పీసీసీ చీఫ్‌ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పలువురు కాంగ్రెస్‌ నేతల ఆశలు అడియాశలయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి నియామకంపై మేడ్చల్‌ కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జ‌గ్గారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

రేవంత్ ను పీసీసీ చీఫ్ గా ఖ‌రారుపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ కేఎల్ ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాహుల్‌ గాంధీకి పంపించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇన్ని కొనసాగినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విలువలతో కూడిన రాజకీయాలు చేశానని, ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్‌ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగను అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొరకు, ఏఐసీసీ సభ్యుడి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను అంగీకరించాలని ఆయన రాహుల్‌గాంధీని కోరారు.

అలాగే, అలాగే రేవంత్‌ రెడ్డి నియామకంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్‌గా నచ్చిన వాళ్లు వస్తే ఒక రకంగా, నచ్చని వాళ్లు వస్తే ఒక రకంగా పని చేయడం అనేది సహజమని, కోఆర్డినేషన్‌ బాధ్యతలు అధ్యక్షుడిదేనని, పార్టీలో అలకలు, అసహనాలు అనేవి సహజమని అన్నారు. వీటన్నింటిని అధ్యక్షుడే హ్యాండిల్‌ చేయాలన్నారు.

పొలిటిక‌ల్ ఫైటింగ్ షురూ..

సాధార‌ణంగానే టీఆర్ఎస్ పైన‌, కేసీఆర్ పైన తీవ్రంగా విరుచుకుప‌డే రేవంత్ పీసీసీ చీఫ్ అనంత‌రం కూడా దూకుడు మొద‌లు పెట్టారు. ఇటీవ‌ల బీజేపీలో చేరిన ఈట‌ల రాజేంద‌ర్ వెనుక కేసీఆర్ వ్యూహం ఉంద‌ని రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టించారు. అనంత‌రం పార్టీలో ఉన్న అసంతృప్తులపై మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి.. భిన్నాభిప్రాయాలు బేధాభిప్రాయాలు కావు.. అందరిని కలుపుకొని వెళ్తూ పార్టీని ముందుకు నడిపిస్తానని పేర్కొన్నారు. మంచి వ్యూహంతోముందుకు వెళ్తామని, నిన్న, మొన్నటి వరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని కూడా కలుపుకొని పోతానని, ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు, కోమటిరెడ్డి బ్రదర్స్‌ మా కుటుంబం, ఉత్తమ్ కుమార్‌, భట్టి విక్రమార్క, జానారెడ్డి లాంటి వాళ్లు తో మాట్లాడి మంచి కార్యచరణతో పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని వ్యాఖ్యానించారు.