iDreamPost
android-app
ios-app

ఆపరేషన్ రాజస్థాన్ – గెహ్లోత్, పైలట్ లను రాహుల్ కలపగలడా?

  • Published Jul 25, 2021 | 9:58 AM Updated Updated Jul 25, 2021 | 9:58 AM
ఆపరేషన్ రాజస్థాన్ – గెహ్లోత్, పైలట్ లను రాహుల్ కలపగలడా?

అధికారంలో ఉన్న కొద్దిపాటి రాష్ట్రాల్లో నేతల మధ్య కీచులాటలతో గత కొంతకాలంగా సతమతం అవుతున్న కాంగ్రెస్ అధిష్టానం మెల్లగా ఒక్కో రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ వస్తోంది. రెండేళ్లకు పైగా సాగిన పంజాబ్ పోరును కొద్ది రోజుల కిందటే రాజీ మార్గం ద్వారా పరిష్కరించిన పార్టీ నాయకత్వం ఇప్పుడు రాజస్థాన్ పై దృష్టి సారించింది.

ఏడాది కాలంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పదవుల విషయంలో పార్టీ తనకు ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ పైలట్ తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడానికి గతంలో సిద్ధమయ్యారు. దాంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం పైలట్ ను ఢిల్లీ పిలిపించి బుజ్జగించింది. త్వరలో అన్నీ సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఆమేరకు పంజాబ్ సమస్య పరిష్కారం అయిన వెంటనే రాజస్థాన్ విభేదాల పరిష్కారానికి నడుం కట్టింది.

పార్టీ, ప్రభుత్వంలో మార్పులపై చర్చలు

రాష్ట్ర మంత్రివర్గంలోనూ పార్టీలోనూ మార్పులు చేసి పైలట్ వర్గానికి ప్రాతిథ్యం పెంచడం ద్వారా విభేదాలకు చెక్ పెట్టాలని భావిస్తున్న అధిష్టానం తరఫున పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, రాజస్థాన్ వ్యవహారాల ఇంఛార్జి అజయ్ మాకెన్ శనివారం సాయంత్రం జైపూర్ వెళ్లారు. ఆ రాత్రే సీఎం అశోక్ గెహ్లోత్ తో విందు సమావేశంలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చించారు.

కాగా ఆదివారం ఉదయం పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతాస్రా అధ్యర్యంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో సమావేశానికి హాజరైన అసమ్మతి నేత సచిన్ పైలట్ తమ డిమాండ్లను పునరుద్ఘాటించారు. అనంతరం అజయ్ మాకెన్ మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ, మార్పులపై త్వరలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నెలాఖరులోగా మరోసారి వచ్చి మరికొందరి అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు.

నెలాఖరులోగా సర్దుబాట్లు

ప్రస్తుత పరిణామాలను చూస్తే ఈ నెలాఖరులోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఈ సందర్బంగా కొందరు మంత్రులను తప్పించవచ్చని అంటున్నారు. రాజస్థాన్ మంత్రివర్గంలోకి సీఎంతో సహా 30 మంది మంత్రులను తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం 21 మందే ఉన్నారు. మిగతా ఖాళీల్లో సచిన్ పైలట్ వర్గీయులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పదవులు, పార్టీ జిల్లా, బ్లాక్ అధ్యక్షుల నియామకాలు కూడా పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. వీటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి పార్టీలో సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పాలని అధిష్టానం లక్ష్యంగా పెట్టుకుంది.