iDreamPost
iDreamPost
కరోనా వైరస్ సెకండ్ వేవ్ పై ఇప్పటికే పలువురు ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎవరూ ఆదమరచి వ్యవహరించవద్దని చెబుతున్నారు. ప్రధానంగా పండుగల సీజన్, వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. అదే సమయంలో చలికాలం సహజంగానే వైరస్ లకు వేగంగా వ్యాపించడానికి సానుకూలంగా ఉంటుంది కాబట్టి మరింత జాగ్రత్తలు అవసరమని చెబుతున్నారు.
ఈ అంచనాలకు అనుగుణంగానే పలు ప్రాంతాల్లో మరోసారి వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గుజరాత్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కర్ఫ్యూ మొదలయ్యింది. ఢిల్లీలో అయితే దాదాపుగా లాక్ డౌన్ వాతావరణం కనిపిస్తోంది. హర్యానా లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆంక్షలు విధించారు. పలు రాష్ట్రాల్లో వైరస్ తాకిడి మొదలయిన తరుణంలో దక్షిణాదిలోనూ దాని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది.
అయితే ఏపీలో కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చినట్టు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రశంసలు కురిపించాయి. ముఖ్యమంత్రి ముందుచూపు ప్రదర్శించి నిర్వహించిన పరీక్షలు కారణంగా అపార నష్టం నివారించి, ప్రజలను గట్టెక్కించేందుకు తోడ్పడిందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి స్థానిక ఎన్నికల కోసం కొందరు పట్టుబడుతుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో కొత్త కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. కానీ యాక్టివ్ కేసుల రీత్యా టాప్ 5లో ఇప్పటికీ ఏపీ ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను, జీహెచ్ఎంసీ ఎన్నికలను పోల్చి కొందరు ఏపీలో స్థానిక ఎన్నికలకు ముహూర్తం పెట్టాల్సిందేననడం విడ్డూరంగా మారింది. కేసులు లేనప్పుడు కరోనా వస్తుందనే భయంతో ఎన్నికలు వద్దని వాదించిన వారే, ఇప్పుడు కేసులు వస్తున్నప్పటికీ ఎన్నికల కోసం పట్టుబడుతున్న తీరు మీద సామాన్యులు కూడా చిటపటలాడుతున్నారు. జిల్లాల విభజనకు అంతా సిద్ధమయిన తరుణంలో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించడం శ్రేయస్కరమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అండ్ కో వ్యూహం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ వంటి వారు ఎంతగా తపన పడినా అది రాష్ట్రానికి చేటు చేసే ప్రమాదం ఉన్నందున యధాస్థితిని మరో నాలుగు నెలల పాటు కొనసాగించాలనే వాదన పెరుగుతోంది. కరోనా కారణంగా కాలు బయటపెట్టలేని చంద్రబాబు, కనీసం రాజకీయ పార్టీలన్నింటితో కలిపి ఉమ్మడి సమావేశం పెట్టలేని నిమ్మగడ్డ కలిసి ప్రజలను రోడ్డు మీదకు తీసుకురావాలనే ఎత్తులు వేయడాన్ని తప్పుబడుతున్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలతో పరిహాసం ఆడొద్దని సూచిస్తున్నారు.