iDreamPost
iDreamPost
టీడీపీలో ఆయన అత్యంత సీనియర్ నేత. చంద్రబాబు కోటరీలో ఒకరిగా చెలామణీ అవుతుంటారు. ప్రజల్లోకి రాకుండా పేపర్ ప్రకటనల్లో మాత్రం తరచూ కనిపిస్తుంటారు. టీడీపీ వాణిని వినిపిస్తుంటారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు పార్టీలో మాదిరిగానే సొంత నియోజకవర్గంలోనూ ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించేవారు. కంచుకోటగా ఉన్న తునిలో ఇప్పుడు మాట చెల్లకపోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా.. పార్టీ టికెట్ విషయంలో మాత్రం ఆయనకు ఇంటిపోరు ఎదురవుతోంది. కుటుంబసభ్యుల మధ్యే పోటీ మొదలైంది. దాంతో గందరగోళంలో పడిన టీడీపీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక పోతోంది.
బీటలు వారిన కంచుకోట
యనమలకు రెండు దశాబ్దాలకుపైగా కంచుకోటలా ఉన్న తుని తర్వాత కాలంలో నిరాదరణకు గురిచేసింది. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా.. ఆ తర్వాత 1985 నుంచి 2004 వరకు టీడీపీ అభ్యర్థిగా ఏకధాటిగా ఆరుసార్లు ఎన్నికైన రామకృష్ణుడు స్పీకర్ గా, మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. 2009లో తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి వత్సవాయి వెంకట కృష్ణంరాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ దెబ్బతో ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైన ఆయన తన వారసుడిగా సోదరుడు కృష్ణుడును రంగంలోకి దించారు. 2014, 19 ఎన్నికల్లో ఆయన కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో పరాజయం ఎదుర్కొన్నారు. అయితే ఎమ్మెల్సీ అయిన యనమల 2014లో ఏర్పాటైన చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవి చేపట్టారు. అన్న పదవిని అడ్డుపెట్టుకుని తమ్ముడు కృష్ణుడు నియోజకవర్గంలో రెచ్చిపోయారు. దాంతో ఆయన పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ కారణంతోనే గత ఎన్నికల్లో అతన్ని ఓడించిన ప్రజలు ఇప్పటికీ అతన్ని నేతగా అంగీకరించడంలేదు.
కుటుంబంలోనే త్రిముఖ పోరు
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీకి సిద్ధపడుతున్నారు. అయితే ఆయన పోటీ చేస్తే మరోసారి ఓటమి తప్పదని యనమలతోపాటు టీడీపీ అధిష్టానం భయపడుతున్నాయి. కార్యకర్తలు కూడా కృష్ణుడిని అంగీకరించని స్థితిలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యామ్నాయ నేత కోసం ఆలోచిస్తున్నారు. అదే తరుణంలో యనమల కుటుంబంలోనే టికెట్ పోరు మొదలైంది. కుమార్తె దివ్యను తన వారసురాలిగా తుని బరిలో దించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈసారి ఎలాగైనా కుమార్తెను పోటీ చేయించాలన్న ఉద్దేశంతో అధినేతపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా వీరిద్దరిని కాదని యనమల మరో సోదరుడు రాజేష్ తాజాగా రంగంలోకి వచ్చారు. తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సీనియర్ నేత కుటుంబంలోని ముగ్గురు పోటీ పడుతుండటంతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక ఇంఛార్జి నియామకాన్ని పెండింగులో పెట్టారు. త్వరలోనే నియోజకవర్గ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నేతల అభిప్రాయాలు తెలుసుకుని.. ఇంఛార్జీని ప్రకటించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
Also Read : నొప్పించక తానొవ్వక … సన్నాయి నొక్కులు !