iDreamPost
android-app
ios-app

సోషల్‌ మీడియాలో ‘మత’ యుద్ధం

  • Published Jun 14, 2020 | 2:04 PM Updated Updated Jun 14, 2020 | 2:04 PM
సోషల్‌ మీడియాలో ‘మత’ యుద్ధం

స్వేచ్ఛాభిప్రాయం వ్యక్తం చేసుకునేందుకు సోషల్‌ మీడియా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు విస్తృతంగా ఉపయోగపడుతోంది. రెండువైపులా పదునుండే కత్తికి మాదిరిగానే ఇక్కడ మంచీ, చెడూ అనేవి రెండు అందుబాటులో ఉంటున్నాయి. వాటివాటి వినియోగాన్ని బట్టి, వినియోగించుకునేవారి స్వభావాన్ని బట్టి మాత్రమే వాటి ఫలితం లభిస్తుంది. కులం, మతంగా సమాజాలు విడిపోయే దురదృష్టకరమైన పరిస్థితులకు చాలాకాలం క్రితమే అంకురార్పణ జరిగిపోయింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆయా మతాలకు చెందిన వారు చెలరేగిపోతున్నారు.

నా మతమే గొప్ప అంటే.. కాదు నా మతమే గొప్ప అంటూ పోటాపోటీగా యూ ట్యూబ్‌లలో వీడియోలు పెట్టేసి తమతమ ‘మత ప్రావీణ్యత’ను చాటుకుంటున్నారు. ఆయా వీడియోల క్రింద ఎవరికి మద్దతుగా నిలిచేవాళ్ళు వాళ్ళవాళ్ళ కామెంట్లతో ఆనందించేస్తున్నారు. ఒక వేళ ఎవరైనా ఇది కరెక్టు కాదని వైరిపక్షాలకు కామెంట్‌ రూపంలో చెబుదామనుకున్నా ‘నాస్తికుడి’ ముద్రవేసుకోవాల్సి వస్తుందేమోనని కొంచె ఆలోచన ఉన్నవాళ్ళు మౌనంగా ఉంటున్నారు. ఎవరి ఉద్దేశాల్ని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు కానీ, ఎదుటి వారిని అకారణంగా నిందించడమే ఇక్కడ నిందార్హమవుతోంది.

తమ మతమే గొప్ప అని చెప్పుకునే సమయంలో అడ్డుకునేందుకు ఎవ్వరికీ అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు ఉండదు. అయితే ఎదుటి మతాలపై వ్యాఖ్యలు చేస్తేనే రాజ్యాంగమైనా, చట్టమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొందరు ఇంకాస్త ముందుకడుగేసి అప్పుడెప్పుడో గతించిన వాళ్ళు ఇలా నష్టం చేసారు, ఇలా మేలు చేసారంటూ వాళ్ళను కూడా ఇందులోకి లాగేస్తున్నారు. అధికారంలో ఉన్నవాళ్ళను, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళను కూడా ఈ రొంపిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. సమర్ధించే వాళ్ళ నమ్మకాన్ని అనుసరించి తప్పితే మతానికి ఖచ్చితమైన నిర్వచనం అనేదే లేదన్నది పలువురి అభిప్రాయం. అయితే ఇవేమీ పట్టని యూట్యూబ్‌ వైరివర్గాలు ఇష్టారీతిన వీడియోల యుద్ద మాత్రం కొనసాగించేస్తున్నారు.

వెనకటికో పెద్దాయన చెప్పిటన్లు ‘ఎంత సన్నాసి అయినా.. వాడ్ని సమర్ధించే వాడు కూడా ఉంటాడు’ అన్నది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క మహమ్మారి కారణంగా ప్రపంచం అతలాకుతలమైపోతోంది. లక్షలాది మంది మృత్యువాత పడి, వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాయి. బ్రతకడానికి ఏ దేవుడ్ని వేడుకోవాలో కూడా సామాన్యుడికి అర్దం కాని పరిస్థితులు నెలకొన్నాయి. కోట్ల మంది సాయం కోసం పడిగాపులు పడుతున్నారు. కుటుంబ సమేతంగా కడుపునిండా తినేందుకు ఢోకా లేని భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం తమను ఎవరు ఆదుకుంటారని ఆశతో రోజు గడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటివేమీ పట్టించుకోని ఈ యూ ట్యూబ్‌ మత యుద్దవీరులు మాత్రం తమ ధోరణిని కొనసాగించేస్తున్నారు.