iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన ప్రక్రియకు అనుగుణంగా మరో అడుగు పడింది ఇటీవల క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కమిటీ నియామకం జరిగింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ అధ్యక్షన కమిటీని నియమిస్తూ జీవో విడుదల చేశారు. ఏపీలో జిల్లాల విభజనపై అధ్యయనం చేసి 25 జిల్లాలుగా మార్చేందుకు అనుగుణంగా నివేదిక సమర్పిస్తుందని జీవో లో పేర్కొన్నారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలో కూడా దానిని ప్రస్తావించారు. దానికి అనుగుణంగా జిల్లాల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ప్రస్తుతం జనగణన నేపథ్యంలో కేంద్రం నుంచి తాత్కాలికంగా ఆంక్షలున్నాయి. వచ్చే మార్చి తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు చేసేందుకు అనుమతి రాబోతున్న తరుణంలో ఈ లోగా దానికి సంబంధించిన వివిధ అధ్యయనం, ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
తాజాగా సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆరుగురు అధికారులుంటారు. అందులో ఒకరు సీఎంవో నుంచి కూడా ఉండడం విశేషం. రాష్ట్రంలో 25 జిల్లాలుగా మార్చేందుకు అనుగుణంగా ఉన్న అవకాశాలు, దానికి తగ్గట్టుగా ప్రతిపాదనలు ఈ కమిటీ రూపొందించబోతోంది. ఇప్పటికే జగన్ ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. తాజాగా కమిటీ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.