iDreamPost
iDreamPost
ఆ కుటుంబంలో అందరూ ఉద్యోగులే. డిగ్రీ చదివిన అతన్ని కూడా ఉద్యోగం చేయమని ఒత్తిడి చేశారు. కానీ అతని ఆలోచనలు వేరేగా ఉన్నాయి. రాజకీయాల్లో చేరి కార్పొరేటర్ గా ఎన్నికై తన డివిజన్ ప్రజలకు సేవ చేయాలన్నది అతని ఆకాంక్ష. ఉద్యోగం చేయకుండా ఇంకేం చేస్తావని తండ్రి ఒత్తిడి చేసి అడిగితే మెల్లగా తన ఆలోచన గురించి చెప్పారు. అదేంటి.. రాజకీయాలు మనలో ఎవరూ చేయడంలేదు. ఉద్యోగం కాదని రాజకీయాలు పట్టుకొని తిరుగుతానంటావేంటి.. అంటూ తండ్రి మొదట కోప్పడ్డారు. కానీ చివరికి అంగీకరించి ప్రోత్సహించారు. అలా యుక్త వయసులోనే 1987లో కాంగ్రెసులో చేరిన ఆయన అనంతరం వైస్సార్సీపీలో చేరారు. అధినేత జగన్ తోనూ కొంత సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన్నే నమ్ముకుని తన రాజకీయ గురువును కూడా కాదని పార్టీలోనే ఉండిపోయినందుకు.. భవిష్యత్తులో తప్పక మేలు చేస్తానని గతంలోనే హామీ ఇచ్చిన జగన్ దాన్ని నిలబెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ నేత విశాఖ నగరానికి చెందిన బొల్లవరపు జాన్ వెస్లీ. ప్రభుత్వం ఆయన్ను ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీ) ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది.
మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో..
జాన్ వెస్లీ తల్లిదండ్రులు ఇద్దరూ జీవీఎంసీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. వారే కాదు ఆ కుటుంబంలో అందరూ ఉద్యోగులే. వెస్లీ మాత్రం రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెసులో చేరారు. 1989లో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఈటీ విజయలక్షి విజయానికి తీవ్రంగా కృషి చేశారు. అనంతరం కాంగ్రెస్ నగర, జిల్లా శాఖల్లో పలు పదవులు నిర్వహించారు. ఆ క్రమంలోనే సబ్బం హరితో పరిచయం ఏర్పడి, సాన్నిహిత్యం పెరిగింది. ఆయన్నే వెస్లీ తన రాజకీయ గురువుగా భావిస్తూ పనిచేశారు. 1995లో ఆయన మేయర్ గా, 2009లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసినప్పుడు వెస్లీయే పోల్ మేనేజ్మెంట్ అంతా చూసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసినప్పుడు ఆయనతో పాటే పార్టీలో చేరారు.
Also Read : జడ్పీటీసీ ఫలితాలు ఆలస్యమే ఆవిడకు కార్పొరేషన్ పదవి తెచ్చిపెట్టింది
జగన్ తో సాన్నిహిత్యం
ప్రస్తుత సీఎం జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సబ్బం హరి కూడా ఎంపీగా చేశారు. లోకసభలో ఇద్దరివీ పక్కపక్క సీట్లే. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి చేరువయ్యారు. అప్పట్లో సబ్బం హరి అనుచరుడిగా తరచూ ఢిల్లీ వెళ్లిన వెస్లీని జగన్ కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఆదరించేవారు. ఆ విధంగా జగన్ తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ కనిపించినా పేరు పెట్టి పలకరిస్తూ.. దగ్గరికి రమ్మనేవారు. కాగా 2013లో సబ్బం పార్టీని వీడినప్పుడు.. వెస్లీ ఆయన వెంట వెళ్లలేదు. పార్టీ అధినేత జగన్ను కలిసి మీ వెంటే ఉంటాను.. పార్టీలో కొనసాగుతానని చెప్పారు. దానికి స్పందించిన జగన్ నన్ను నమ్ముకుని ఉండిపోతున్నందున.. భవిష్యత్తులో ఊహించని మేలు చేస్తానని ఆనాడే హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలోనూ దాన్ని పునరుద్ఘాటించారు. ఈలోగా వెస్లీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంటి పదవులు నిర్వహించారు.
తోడైన విజయసాయిరెడ్డి ఆశీస్సులు
పార్టీనే నమ్ముకొని ఏ బాధ్యత అప్పజెప్పినా చిత్తశుద్ధితో, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తున్న జాన్ వెస్లీ పనితీరు గమనించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో తన క్యాంపు కార్యాలయం నిర్వహణ బాధ్యతలను ఆయనకే పూర్తిగా అప్పగించారు. ఏడాదిన్నరగా ఆ బాధ్యతలు నిర్వహిస్తూ విజయసాయిరెడ్డి మన్ననలు పొందడం కూడా వెస్లీకి కలిసి వచ్చింది. అటు జగన్ హామీ.. ఇటు విజయసాయిరెడ్డి ఆశీస్సులు కలిసి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టాయని.. తనకు గుర్తింపు ఇచ్చిన వారిద్దరి రుణం ఎన్నడూ తీర్చుకోలేనని వెస్లీ ఆనందంగా చెప్పారు.
Also Read : పోరాట ఫలం.. ఆ మహిళా నేతకు పీఠం