Idream media
Idream media
జీఎన్ రావు కమిటీపై 27న మంత్రి వర్గంలో చర్చిస్తారట. అసలు జీఎన్ రావు కమిటీకి ఏపకప విశ్వసనీయత ఏంటీ..? అంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన పరిపాలకుడు, విజనిస్టు అయిన చంద్రబాబు నాయుడే జీఎన్ రావు కమిటీకి ఉన్న విశ్వసనీయత ఏంటని ప్రశ్నించడంతో రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ వేదికగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కమిటీలు, అందులోని సభ్యులు, వారి అర్హతలు, విశ్వసనీయతపై జోరుగా చర్చ సాగుతోంది.
2014లో.. చంద్రబాబు ప్రభుత్వం వేసిన కమిటీ ఇదీ..
2014 జూలై 21 తేదీన నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఓ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, వ్యాపార వేత్త వై.సుజనా చౌదరి, లోక్‌సభ సభ్యుడు, వ్యాపార వేత్త గల్లా జయదేవ్, వ్యాపార వేత్త, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు, జీవీకే గ్రూప్ కు చెందిన జీవీ సంజయ్, జీఎంఆర్ గ్రూపునకు చెందిన బొమ్మిడాల శ్రీనివాసర రావు, నూజివీడు సీడ్స్ చైర్మన్ ఎం. ప్రభాకర రావు, ప్రజా రాజధాని కమిటీ చైర్మన్ చింతపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగ అధిపతిలు సభ్యులుగా ఎంపిక చేశారు.
2019లో.. జగన్ ప్రభుత్వం వేసిన కమిటీ ఇదీ…
రాష్ట్ర సమాగ్రాభివృద్ధి, అమరావతి అభివృద్ధిపై 2019 సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జి.నాగేశ్వరరావు (జీఎన్ రావు) అధ్యక్షత ఏర్పాటు చేసిన ఈ కమిటీలో న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ అర్కిటెక్షర్ ప్రొఫెషర్ మహావీర్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ అంజలీ మోహన్, శివనంద స్వామి సెప్ట్ అహ్మదాబాద్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్షర్ రిటైర్డ్ ప్రొఫెషర్ కేటీ రవీంద్రన్, చెన్నైకు చెందిన రిటైర్డ్ అర్బన్ చీఫ్ ప్లానర్ కేవీ అరుణాచల్ సభ్యులుగా ఉన్నారు.
ఎవరి విశ్వసనీయత ఎంత..?
ఆంధ్రప్రదేశ్ విభజన, నూతన ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఎంపికపై కేంద్ర ప్రభుత్వం సుప్రిం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నివేదిక ఇవ్వకముందే చంద్రబాబు తన మంత్రి వర్గంలోని పి.నారాయణ అధ్యక్షతన వ్యపారవేత్తలైన ప్రజా ప్రతినిధులు, జీవీకే, జీఎంఆర్, నూజీవీడు సీడ్స్ వంటి బడా వ్యాపారవేత్తలతో రాజధాని ఎంపిక సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో రాజకీయ నేతలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు, నిపుణులు ఒక్కరూ లేకపోవడం గమనార్హం.
శ్రీ కృష్ణ కమిటీ సిఫార్సులకు భిన్నంగా మంత్రి పి.నారాయణ ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సలహా మేరకు రాజధానిగా అమరావతిని ప్రకటించారు. చంద్రబాబు ప్రశ్నిస్తున్నట్లు జీఎన్ రావు కమిటీకి ఉన్న విశ్వసనీతయ.. వారి అర్హతలే. అందులో ఎవరూ రాజకీయ నేతలు లేరు. వ్యాపారులూ లేరు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో నిఫుణులైన వారు కమిటీలో ఉన్నారు. మరి తాను మంత్రి నారాయణ అధ్యక్షతన వేసిన కమిటీకి, ప్రస్తుత జగన్ సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు అధ్యక్షతన వేసిన కమిటీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటీ..? ఎవరి విశ్వసనీయత ఏంత..? ఆయా కమిటీల్లో సభ్యుల అర్హతలు ఏమిటీ..? అన్నది రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.