iDreamPost
android-app
ios-app

చందా కడితే సినిమా టికెట్ ఫ్రీ

  • Published Apr 29, 2021 | 8:06 AM Updated Updated Apr 29, 2021 | 8:06 AM
చందా కడితే సినిమా టికెట్ ఫ్రీ

సాధారణంగా మల్టీ ప్లెక్సుల్లో కాంబో ఆఫర్లు ఇవ్వడం చూస్తుంటాం. టికెట్ తో పాటు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అంటూ కాస్త తగ్గింపు ధరలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. రేట్ విషయంలో పెద్దగా వ్యత్యాసం ఉండనప్పటికీ సదరు కంపెనీలు దీన్నో మార్కెటింగ్ జిమ్మిక్క్ గా వాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు థియేటర్లు లేవు కాబట్టి ఒక్కొక్కరు ఓటిటి బాట పట్టడం చూస్తున్నాం. సల్మాన్ ఖాన్ రాధే భారీ అంచనాలతో ఇంకో 13 రోజుల్లో హాళ్లతో పాటు ఓటిటిలోనూ వస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 230 కోట్ల పెట్టుబడితో జీ సంస్థ దీని మీద పెద్ద పందెం ఆడబోతోంది. అయితే ఇది పే పర్ వ్యూ మోడల్ కావడం మీద చాలా కామెంట్స్ వచ్చాయి.

కేవలం ఈ ఒక్క సినిమా చూసేందుకు 249 రూపాయలు ధరను నిర్ణయించడం పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూస్తే అసలిది నామమాత్రపు ధర అనేది జీ ప్రతినిధుల వాదన. అయినప్పటికీ సగటు ఇండియన్ మెంటాలిటీ ఇలాంటి ట్రెండ్ ని అంత ఈజీగా ఒప్పుకోదు. అందుకే జీ సంస్థ ఎత్తుగడ మార్చి జీ 5 ప్రీమియం ఏడాది చందా ప్లస్ రాధే వన్ టైం వాచ్ జీ ప్లెక్స్ రెంటల్ కలిపి 499 రూపాయలు ఫిక్స్ చేసింది. మాములుగా అయితే ఈ సబ్స్క్రిప్షన్ 999 రూపాయల దాకా ఉండేది. ఈ లెక్కన జీ 5 ప్రీమియంని చాలా తక్కువ ధరలో అందుకున్నట్టేగా. దీనికి రెస్పాన్స్ బాగానే ఉందట.

ఇవన్నీ విశ్లేషిస్తే జీ ఎప్పుడో గత ఏడాదే మొదలుపెట్టిన ఈ పే పర్ వ్యూ మోడల్ అంతగా సక్సెస్ అవుతున్నట్టు లేదు. గతంలో సోలో బ్రతుకే సో బెటరూ, నిన్నే నిన్నే, కెపే రణసింగంలు ఇదే తరహాలో రిలీజ్ చేస్తే మరీ గొప్ప ఫలితాలు దక్కలేదు. ఇప్పుడేమో సల్మాన్ ఖాన్ సినిమాకు ఈ స్థాయిలో నిరసనలు. అసలే ట్రైలర్ చూశాక ఇదేదో రొట్ట రొటీన్ మసాలా సినిమా అని అర్థమైపోయింది. ఫ్యాన్స్ సంగతి సరేకాని సాధారణ ప్రేక్షకులు దీన్ని ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఇవి చాలవు అన్నట్టు సీటిమార్ సాంగ్ కి మన సౌత్ లో విపరీతమైన ట్రాలింగ్ జరిగింది. చూడాలి మే 13న కండల వీరుడు ఏమేం రికార్డులు సెట్ చేస్తాడో