iDreamPost
android-app
ios-app

మహిళా ఎస్‌ఐకి సెల్యూట్ చేసిన కలెక్టర్.. ఎందుకో తెలుసా..?

మహిళా ఎస్‌ఐకి సెల్యూట్ చేసిన కలెక్టర్.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం దేశాన్ని కరోనా వణికిస్తోంది. అంతేగాకుండా మనుషుల్లో మానవత్వాన్ని కరోనా చంపేస్తుంది. పరాయి వ్యక్తిని అంటరానివాడిగా కరోనా మార్చేసింది. అలాంటిది ఒక వ్యక్తి కరోనాతో మరణిస్తే ఆ మృతదేహం దరిదాపుల్లోకి స్వయానా బంధువులు, ఆత్మీయులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది ఒక మహిళా ఎస్సై చూపించిన తెగువ,సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది..

వివరాల్లోకి వెళితే తమిళనాడులోని తిరువనమలై జిల్లాకు చెందిన ఎస్‌ఐ అల్లిరాణి చూపిన మానవత్వానికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లిరాణి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కరోనా కారణంగా మృత్యువాత పడ్డాడు. కానీ ఆ వ్యక్తి కుటుంబసభ్యులు, బంధువులు తమకు కరోనా వస్తుందేమో అన్న కారణంతో ఆ మృతదేహం వద్దకు రావడానికి భయపడి దూరంగా ఉన్నారు. దాంతో మృతదేహం తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు.. ఈ పరిస్థితుల్లో ఎస్‌ఐ అల్లిరాణి ధైర్యంగా ముందుకొచ్చి ఆ మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించారు.

అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఎస్ఐ చూపిన తెగువ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సాహసోపేత చర్యను ప్రశంసిస్తూ ఆమెను ఉత్తమ ప్రతిభావంతుల అవార్డుకు ఎంపిక చేశారు. ఎంపిక చేయడమే కాకుండా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎస్‌ఐ అల్లిరాణికి పతకం, మెమొంటోను కలెక్టర్ కందస్వామి అందజేశారు. అనంతరం కలెక్టర్ కందస్వామి స్టేజ్ దిగి తాను నిలబడిన స్థానంలోకి ఎస్‌ఐని పంపి ఆమెకు సెల్యూట్ చేశారు. సుమారు 20 సెకన్ల పాటు అలాగే సెల్యూట్ ఆమెను గౌరవించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ కందస్వామి చర్యతో పాటు వృత్తిలో నిబద్ధత చూపిన ఎస్‌ఐ అల్లిరాణిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు..