iDreamPost
android-app
ios-app

మహారాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు..

మహారాష్ట్ర బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు..

దేశంలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతూ అల్లకల్లోలంగా ఉన్న మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికల వేడి మొదలయ్యింది. ఆ రాష్ట్ర బీజేపీలో సీట్ల చిచ్చు మొదలయ్యింది. నివురుగప్పిన నిప్పులా అక్కడి రాజకీయ తయారైంది.

గత ఏప్రిల్‌ 24వ తేదీనే తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ కరోనా వల్ల అప్పుడు వాయిదా వేశారు. అయితే ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడం వల్ల మే 28లోపు ఎమ్మెల్సీగా ఎన్నిక కాకపోతే సీఎం పదవి నుంచి దిగిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి సమస్యను వివరించారు. వెంటనే జోక్యం చేసుకున్న ప్రధాని మోదీ.. ఆ రాష్ట్ర గవర్నర్‌ కోశ్యారీతో మాట్లాడి ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. ఈ క్రమంలో గవర్నర్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, అక్కడి నుంచి అనుమతి రావడం చకచకా జరిగిపోయాయి. ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. శివసేన నుంచి ఉద్దవ్‌ఠాక్రే, సీనియర్‌ నేత, శాసనసభ సిట్టింగ్‌ డిప్యూటీ చైర్మన్‌ నీలమ్‌గోరేలు పోటీలో దిగడం ఖాయమైంది. మిత్ర పక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల గురించి ఇంకా స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చిచ్చు రేపాయి. ఆశావహులు ఎక్కువగా ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముందు నుంచి తనకు ఎమ్మెల్సీ స్థానంపై ఆశతో ఉన్న బీజేపీ సీనియర్‌ నేత, దివంగత డిప్యూటీ సీఎం గోపీనాథ్‌ ముండే కుమార్తె అయిన మాజీ మంత్రి పంకజ ముండేకు మొండిచేయి ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని బీజేపీ అధిష్టానం అప్పట్లో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్‌లో ఆమె పేరు లేదు. నాగ్‌పూర్‌ సిటీ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సన్నిహితుడైన ప్రవీణ్‌ డాట్కే, బీజేపీ మెడికల్‌ సెల్‌ అధ్యక్షుడు గోపీచంద్‌ పడాల్కర్, అజిత్‌ గోప్‌చడే, రంజిత్‌ సింగ్‌ల పేర్లను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. దీంతో అసమ్మతి జ్వాలలు చేలరేగుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీద్‌ జిల్లాలోని పార్లి స్థానం నుంచి పోటీ చేసిన పంకజముండే తన సోదరుడు ధనుంజయ్‌ ముండే (ఎన్సీపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. తన ఓటమి వెనుక కొందరు బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉందంటూ అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను గెలవడం కొందరికి ఇష్టం లేదంటూ పరోక్షంగా మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌పై ఆరోపణలు చేశారు. కొన్ని నెలల పాటు ఆ రాష్ట్రంలో ఇది హాట్‌టాపిగ్‌ మారింది. బీజేపీ అధిష్టానం పంకజ ముండేపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా చెలరేగాయి. దీనికి బలం చేకూర్చుతూ ఆమె తన తండ్రి జయంతి సందర్భంగా గత డిసెంబర్‌లో మాట్లాడుతూ.. తనను పార్టీలో కొనసాగించే అంశంపై అధిష్టానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చన్నారు. ఆ తర్వాత కొందరు బీజేపీ పెద్దలు ఆమెతో మాట్లాడి పరిస్థితిని కంట్రోల్‌ చేశారు. అప్పుడే ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మొండిచేయి ఎదురవడంతో ఆమె అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. సీటు రాకుండా మాజీ సీఎం ఫడ్నవిస్‌ అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన కేబినెట్‌లో పంకజ మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.

కాగా, ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం వల్ల తనకేమీ అసంతృప్తి లేదని ఆమె చెప్పడం గమనార్హం. మద్ధతుదారులెవరూ నిరాశ చెందవద్దని, తమకు దివంగత గోపీనాథ్‌ ముండే ఆశీస్సులు ఉన్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఆమె అలా చెబుతున్నప్పటికీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని తెలుస్తోంది.
అలాగే ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడిన చంద్రశేఖర్‌ భవకులే, ఏక్‌నాథ్‌ ఖడ్సే కూడా అసంతృప్తిలో ఉన్నారు. వీరిలో ఖడ్సే ముక్తాయ్‌ నగర్‌ నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికం, జలవనరుల శాఖల మంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తికి గత ఎన్నికల్లో బీజేపీ సీటు నిరాకరించింది. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని అప్పట్లో చెప్పింది. ప్రస్తుతం అది నెరవేరకపోవడంతో ఆయన తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్తు తెలుస్తోంది. అలాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత ఎన్నికల్లో టికెట్‌ దక్కని భవన్‌కులే కూడా అసంతృప్తితో ఉన్నారు.