Idream media
Idream media
“లోకేశే సరైనోడైతే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొస్తాది..? 17 అయిపోతే ఫ్రీ అయిపోతాం.. తర్వాత పార్టీ లేదు బొక్కా లేదు” అంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో ఎఫెక్ట్ పార్టీపైన, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపైన ఎలా ఉందో అన్న సంగతి పక్కన బెడితే.. ఆ పార్టీ అధినేత కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరిస్థితి ఏంటో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోకేశ్ గురించి, పార్టీలో ఆయన ప్రాధాన్యం పెరిగిన తర్వాత ఏర్పడిన పరిస్థితులపైన పార్టీని వీడేవాళ్లు కొందరు బాహాటంగా మాట్లాడినా, పార్టీలో ఉంటూ మరి కొంత మంది లోలోన, అంతర్గతంగానూ మదన పడుతూనే ఉంటారు. మనకు వినపడకుండా ఎన్ని మాటలు అనుకుంటున్నా పర్వాలేదు కానీ, మనకు చీపురు పుల్ల విలువ ఇవ్వకుండా తెలిసేలా మాట్లాడితే ఇబ్బందే. అలాంటిది లోకేశ్ గురించి అచ్చెన్న నాయుడు అన్నమాటలు ప్రపంచం అంతా వైరల్ అయ్యాయి. దీంతో ఏపీ భావి నేతగా ఎదగాలనుకుంటున్న లోకేశ్ ఎలా అర్థం చేసుకున్నారో. పైకి ఆ వీడియో గురించి చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఇప్పటి వరకూ మాట్లాడిన దాఖలాలు లేవు.
తెలుగుదేశం పరిస్థితి, లోకేష్ తీరుపై కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో బహిర్గతమై తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు దానిపై ఇప్పటికీ మౌనంగానే ఉన్నారు. మిగిలిన అన్ని విషయాలపై మీడియాలో ఎడతెగకుండా మాట్లాడే నాయకులు.. ఈ వీడియో విషయమై నోరు మెదప లేదు. మాట్లాడితే ఏమి ఇబ్బంది వస్తుందోనని ముఖ్య నాయకులు నోటికి తాళం వేసుకున్నట్లుగా పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించినా చంద్రబాబు, లోకేశ్ లు స్పందించడానికి ఇష్టపడ లేదు. కానీ అచ్చెన్నాయుడుతో ఈ వీడియో గురించి చర్చించినట్లు తెలిసింది. అందులో మాట్లాడిన విషయాలపై అచ్చెన్న ఆయనకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరోవైపు లోకేష్ కూడా లోలోన దీనిపై రగిలిపోతున్నా, పైకి మాత్రం అందులో మాట్లాడింది తన గురించి కాదన్న రీతిలో బిల్డప్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
వీడియో బహిర్గతం అయిన తర్వాత ఒకటి, రెండు కార్యక్రమాల్లో అచ్చెన్నాయుడు, లోకేశ్ కలిసే పాల్గొన్నారు కూడా. అయితే, కలిసికట్టుగా కార్యక్రమం చేపట్టారనడం మినహా, చివరి వరకూ ఇరువురూ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించారు. లోకేష్ మీడియాతో మాట్లాడే సమయంలో అచ్చెన్నాయుడు వెనుక ఉండిపోయారు. ఎమ్మెల్యే రామానాయుడు మాత్రమే పక్కన నిల్చొన్నారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పరిస్థితి ఏమిటో ఆ వీడియోతో తేటతెల్లం అయ్యిందని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. లోకేష్‌పై తెలుగుదేశం నేతల్లో ఏమాత్రం నమ్మకం లేదన్న విషయం నిజమేనని, ఇప్పటికే ఆయన అనేక రకాలుగా అభాసుపాలయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోవడం, మాట్లాడే పద్ధతి ఇప్పటికీ అలవాటు కాకపోవడం పెద్ద మైనస్ అని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ముగిస్తే తెలుగుదేశం కార్యకలాపాలు మరింత డీలా పడతాయన్న అచ్చెన్నాయుడు మాటలు అక్షర సత్యం కానున్నాయని వివరిస్తున్నారు.
అచ్చెన్నాయుడిలో ఇంకా చాలా అసంతృప్తి ఉందని, వీడియోలో కొంత వరకే బయటకు వచ్చిందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. లోకేష్ వల్ల పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ క్యాడర్ దీనిపై ఆందోళనకు గురవుతోంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో అధ్యక్షుడి హోదాలో ఉన్న అచ్చెన్నాయుడే పార్టీ పట్ల అంత అసంతృప్తితో ఉంటే ప్రజలను ఎలా మెప్పించగలమని వాపోతున్నారు.