బిగ్ బాస్ ఒకే టాస్కుని మూడు రోజుల పాటు నడిపించడం కొంత బోర్ కు దారి తీస్తోంది. మొన్నటి కాయిన్ టాస్కు నిన్న కూడా కొనసాగింది. రేపు కూడా కంటిన్యూ చేయబోతున్నారు. హౌస్ లో పై నుంచి పడిన నాణేలను సేకరించి ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్లుగా నిలుస్తారని చెప్పిన సంగతి తెలిసిందే. పక్క వాళ్ళ కాయిన్స్ ని దొంగతనం చేసే వెసులుబాటు కూడా ఇందులో ఇచ్చారు. షో ప్రారంభంలో అమ్మ రాజశేఖర్, దివిల వద్ద ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. హారిక, అరియానాలు రాత్రి అందరూ పడుకున్నాక చోర్ అవతారాలు ఎత్తారు.
సోహైల్, మెహబూబ్ లు వెనకబడిపోతున్నామన్న భయంతో కునుకు వదిలేసి మరీ సభ్యుల కాయిన్స్ ని దొంగలించే పనిని పెట్టుకున్నారు. అయితే నిన్న కిందకు విసిరిన వాటిలో స్విచ్ కాయిన్ అని ప్రత్యేకమైన నాణెం ఒకటి వచ్చింది. కాని అందులో ఎటువంటి ప్రత్యేకత కనిపించకపోవడంతో ముందు దాన్ని దక్కించుకున్న మెహబూబ్ అది పనికిరాదని భావించి పారేస్తే సుజాత దాచుకుంది. తీరా బిగ్ బాస్ తర్వాత దాని విలువను వివరిస్తూ అది ఉన్నవాళ్ళకు ప్రత్యేకమైన కానుక ఉంటుందని చెప్పడంతో షాక్ తినడం మెహబూబ్ వంతయ్యింది. సోహైల్ చేత చీవాట్లు కూడా తిన్నాడు. తర్వాత సుజాత నుంచి దాన్ని దొంగలించే స్కెచ్ వేసినా ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు.
తెల్లవారాక లేచి చూసిన హౌస్ మేట్స్ కు తమ కాయిన్స్ చోరీ అయ్యాయని గుర్తించి దానికి కారణమైన సోహైల్, మెహబూబ్ లను తిట్టిపోశారు. అయినా లాభం లేకపోయింది. తర్వాత లెవెల్ కు వచ్చేటప్పటికి ఈ ఇద్దరే లీడింగ్ లో ఉండటం గమనార్హం. నెక్స్ట్ కిల్లర్ కాయిన్ అనే టాస్క్ ఇచ్చారు. ఇది దొరికిన వాళ్ళు దాన్ని వేరేవాళ్ళకు అంటగట్టాలి. ఒకవేళ అది వాళ్ళ దగ్గరే మిగిలిపోతే మటుకు 50 శాతం పాయింట్లు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సోహైల్, అమ్మ రాజశేఖర్ ల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. గేమ్ ఆడుతున్న క్రమంలో అవినాష్ గాయపడ్డాడు. వెంటనే డాక్టర్ రూమ్ కు వెళ్ళిపోయాడు. ఇది ఇవాళ కూడా కొనసాగుతుంది. ఈ వారం ఎలిమినేషన్లలో ఈ కాయిన్ గేమ్ చాలా కీలకంగా మారబోతోంది. ఎవరు బయటికి వెళ్లాల్సి వస్తుందనే విషయంలో ఈ పాయింట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఓ టాస్కులో గంగవ్వ తక్కువ పాయింట్లతో ఉండటం గమనార్హం