iDreamPost
iDreamPost
ప్రపంచంలోని అనేక దేశాలలో బొగ్గు కొరత ఏర్పడింది. దేశంలోనూ సగానికి పైగా రాష్ట్రాల్లో థర్మల్ విద్యుత్ పరిస్థితి దయనీయంగా మారింది. ఏపీలో కూడా ఈ ముప్పు పొంచి ఉందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి నివేదించారు. దేశంలోనే తొలిసారిగా ఆయన స్పందించారు. జగన్ బాటలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో నాలుగు థర్మల్ పవర్ ప్లాంటున్నాయి. అందులో రెండు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. విజయవాడ ఇబ్రహీంపట్నం వద్దనున్న వీటీపీఎస్ తో పాటుగా కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుని జెన్కో నడుపుతోంది. కృష్ణపట్నంలోని పవర్ ప్లాంట్ ని ఏపీ ఎలక్ట్రిసిటీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. విశాఖలోని పరవాడ ప్లాంట్ ఎన్టీపీసీ యాజమాన్యంలో ఉంది.
వీటీపీఎస్, ఆర్టీపీఎస్ లో ఒకటి రెండు రోజులకు మినహా బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేంద్రం నుంచి అదనంగా బొగ్గు ర్యాక్స్ తీసుకురావడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా సింగరేణి, మహానంది తో పాటుగా ఆస్ట్రేలియా నుంచి ఏపీకి ప్రధానంగా బొగ్గు రవాణా అవుతుంది. అయితే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి కావాల్సిన బొగ్గు ఖరీదు అమాంతంగా 400 రెట్లు పెరిగిపోవడం కలకలం రేపింది. పైగా రవాణా సమస్య కూడా ఏర్పడడంతో ఏపీ ప్రభుత్వం కోల్ ఇండియా మీద ఆధారపడింది. దానికి తగ్గట్టుగా కేంద్రంతో సమన్వయం చేసుకుని బొగ్గు రవాణా ఏర్పాట్లు చేసింది. ఫలితంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోకూడదనే సంకల్పంతో సాగుతోంది.
Also Read : అప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు బొగ్గు కొరత, ఎందుకిలా జరుగుతోంది..
అదే సమయంలో హైడల్ పవర్ ప్రొడక్షన్ కూడా పెరగడం ఊరటనిస్తోంది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ప్లాంటు, సీలేరు పవర్ ప్లాంటుల నుంచి ఎక్కువగా జల విద్యుత్ వస్తోంది. దాంతో ప్రస్తుతానికి విద్యుత్ గండం నుంచి గట్టెక్కేందుకు అవకాశం కలుగుతోంది. గడిచిన కొన్ని రోజులుగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంటుందని తొలుత భావించినా ప్రస్తుతానికి కాస్త ఉపశమనం కనిపిస్తోంది. పల్లెల్లో కొద్ది మేరకు కోతలు తప్ప రాష్ట్రమంతా చీకటి పాలుకావాల్సిన అవసరం రాలేదు. ఇదే రీతిలో గట్టి ప్రయత్నాలు చేసి గండం నుంచి గట్టెక్కాలని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరెంటు కోతలు నామమాత్రంగా ఉన్నాయి. అందులో వ్యవసాయ సీజన్, బోర్లు అన్నీ పనిచేస్తున్నా వ్యవసాయ విద్యుత్, పరిశ్రమలకు ఎవరికీ లోటు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో యూనిట్ కి రూ. 20 వరకూ ఉన్నప్పటికీ ఎంత మొత్తమయినా చెల్లించి కొనుగోలు చేసేందుకు సన్నద్ధం కావడంతో ఏపీలో విద్యుత్ కోతలు నామమాత్రంగా ఉన్నాయి. అదే సమయంలో థర్మల్ పవర్ స్టేషన్లలో మూతపడిన యూనిట్లలో మళ్లీ ఉత్పత్తి పునరుద్దరణకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దానికి అనుగుణంగా బొగ్గు దిగుమతులకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకూ సత్ఫలితాలు ఇస్తుండడంతో ఇక బొగ్గు కొరత సమస్య నుంచి గట్టెక్కగలమనే ధీమా అధికారుల్లో ఉంది. అయితే సీఎం కోరినట్టు గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంటులకు కూడా తగిన గ్యాస్ అందిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా కోలుకుంటామని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ కేంద్రం నుంచి దానికి అనుగుణంగా స్పందన కనిపించకపోవడం విశేషం.
Also Read : బొగ్గు కొరతపై జగన్ సూచనలను కేంద్రం పట్టించుకుందా?