iDreamPost
iDreamPost
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తొలగింపు ఎంత అనూహ్యంగా జరిగిందో.. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపిక అంతే అనూహ్యంగా జరిగింది. తాజాగా భూపేంద్ర పటేల్ కేబినెట్ కూర్పులోనూ అదే గోప్యత పాటించారు. పాత మంత్రులందరినీ పూర్తిగా పక్కన పెట్టేసి.. కొత్త ముఖాలతో జూనియర్ జట్టును సీఎంకు అంటగట్టారు. మంత్రుల ఎంపిక అంతా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో సాగింది.
గుజరాత్ రాష్ట్రమే కాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే తరహాలో జరుగుతోంది. ఒకప్పుడు క్రమశిక్షణ, సిద్ధాంతాలపై ఆధారపడిన పార్టీగా పేరున్న బీజేపీ మోడీ-షా ద్వయం చేతిలోకి వచ్చాక సిద్ధాంతాలకు నీళ్లొదిలి.. వ్యక్తి పూజకు దిగజారిపోయిందన్న ఆరోపణలకు ఇటీవలి పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. తమకు నచ్చినన్నాళ్లు సీఎంలను కొనసాగనివ్వడం.. మొహం మొత్తిన మరుక్షణం వారిని ఉన్న ఫళంగా తొలగించి తమ అడుగులకు మడుగులొత్తే మరో నేతను కూర్చోబెట్టడం అలవాటుగా మారింది.
వాస్తవానికి ఈ సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. ఏడు దశాబ్దాల కాంగ్రెస్ విధానాన్ని.. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే మోడీ-షా అందిపుచ్చుకున్నారు. అయితే తాము చేయదల్చుకున్నదాన్ని.. చర్చలు, అసంతృప్తులు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా నిశ్శబ్దంగా కానిచ్చేయడంలో కాంగ్రెస్ కంటే తాము రెండాకులు ఎక్కువేనని వీరిద్దరూ నిరూపిస్తున్నారు. అదే కాంగ్రెస్ లో సీఎంల మార్పుల సందర్బంగా ఎంత రచ్చ జరుగుతుందో చెప్పనవసరం లేదు.
కాంగ్రెసులో అలా..
తమకు నచ్చని ముఖ్యమంత్రులను రాత్రికి రాత్రి మార్చేసే సంప్రదాయం ఇందిరాగాంధీ హయాంలో మొదలైంది. తమ అడుగులకు మడుగులొత్తని, రాష్ట్రాల్లో సొంత నిర్ణయాలు తీసుకునే సీఎంలను రకరకాల కారణాలతో తప్పించేసేవారు. వారి స్థానంలో సీల్డ్ కవర్ రాజకీయాలతో తమకు నచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టేవారు. ఎమ్మెల్యేలతో చర్చలు, ఏకాభిప్రాయ సాధన పేరుతో రెండు మూడు రోజులు తతంగం నడిపించేవారు. చివరికి ఢిల్లీ నుంచి వెళ్లే పరిశీలకుల చేతుల్లో సీల్డ్ కవర్ పెట్టి.. అందులో పేర్కొన్న నేత పేరుకే ఎమ్మెల్యేలు ఓకే చెప్పేలా మంత్రాంగం నెరిపేవారు.
Also Read : ఆఫర్ల ఆప్..!టార్గెట్ యూపీ ఎలెక్షన్
ఈ కారణంతోనే ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప కాంగ్రెస్ ముఖ్యమంత్రులెవరూ పూర్తికాలం సీఎం పదవుల్లో కొనసాగలేకపోయారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 1971-77, 1980-89 మధ్య కాలంలో ఏకంగా తొమ్మిదిమంది సీఎంలను మార్చారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లోనూ ఇదే తంతు నడిచింది.
బీజేపీలో ఇలా..
2014లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పటివరకు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. ఆయన సన్నిహితుడు అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర హోంమంత్రిగా పదవి చేపట్టారు. పార్టీ, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన వీరిద్దరూ తమ పార్టీ ముఖ్యమంత్రుల కుర్చీలాటకు తెర తీశారు.
మోదీ ఖాళీ చేసిన గుజరాత్ సీఎం కుర్చీలో మొదట ఆనంది బెన్ పటేల్ ను కూర్చోబెట్టారు. 2017 అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు ఆమెను తప్పించి విజయ్ రూపానీని సీఎం చేశారు. మళ్లీ ఇప్పుడు 15 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఆయన్ను అనూహ్యంగా తప్పించి ఎవరూ ఊహించని రీతిలో తొలిసారి ఎమ్మెల్యే అయిన భూపేంద్ర పటేల్ ను గద్దె ఎక్కించారు. ఇక ఉత్తరాఖండ్ లో మొదట త్రివేంద్ర సింగును, తర్వాత తీరథ్ సింగును మూడు నెలల వ్యవధిలోనే తప్పించి ముచ్చటగా మూడో సీఎంగా అనూహ్యంగా పుష్కర్ సింగ్ దమీని సీఎం చేశారు. గత ఏప్రిల్లో ఎన్నికలు జరిగిన అసోంలో బీజేపీ రెండోసారి విజయం సాధించినా.. సిట్టింగ్ సీఎం శర్వానంద్ సోనోవాల్ ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత్ విశ్వ శర్మకు సీఎం పదవి ఇచ్చారు. కర్ణాటకలో యడ్యూరప్పను మాత్రం కొంత చర్చ తర్వాత మార్చారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ ను తప్పించే పనిలో పడ్డారు.
Also Read : కెప్టెన్ అమరీందర్ సింగ్ పదవికి ఎసరు?
లౌక్యంగా మార్పులు
సీఎంల మార్పులో మోదీ-షా లౌక్యంగా వ్యవహరిస్తూ నిశ్శబ్దంగా పనులు పూర్తి చేసేస్తున్నారు. పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఇన్ని మార్పులు చేస్తున్నా.. ఏమాత్రం అసంతృప్తి, వ్యతిరేకత ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు. తమకు ఎదురు లేదని భావించిన చోట చకచకా నిర్ణయాలు తీసుకొని.. తమ పట్ల విధేయంగా ఉండే నేతలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతున్నారు. కాస్త పట్టుండి ఎదురుతిరుగుతారనుకున్న నేతలను వదిలేస్తున్నారు. కర్ణాటకలో గతంలో యడ్యూరప్పను తప్పించినప్పుడు సొంత పార్టీ పెట్టి హడావుడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న జూలైలో ఆయన్ను రెండోసారి పదవి నుంచి తప్పించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పలు హామీలు ఇచ్చి చల్లబర్చి వేటు వేశారు. అదే యూపీలో యోగి అదిత్యనాథ్ ను తప్పించాలని చూసినా ఆయనకు పార్టీలోనూ, ప్రజల్లోనూ ఆదరణ ఉన్న విషయాన్ని గుర్తించి ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.
కాంగ్రెస్ అధిష్టానంలో ఈ లౌక్యమే లోపించింది. వారు అనుకున్న మార్పులు నేరుగా చేయలేకపోతున్నారు. ఒక సీఎంను తప్పించాలంటే అతనికి వ్యతిరేకంగా ప్రత్యర్థి గ్రూపులను రెచ్చగొట్టి.. ఫిర్యాదులు, ఆరోపణలు చేయించి వ్యవహారం రచ్చకెక్కేలా చేస్తున్నారు. అప్పుడు అధిష్టానం రంగంలోకి దిగి చర్చలు, అభిప్రాయ సేకరణలు, కమిటీల నివేదికలంటూ హడావుడి చేసి చివరాకరికి తాము అనుకున్న నేత పేరును సీల్డ్ కవర్లో పంపి ఓకే చేయిస్తున్నారు. ఇటీవలి పంజాబ్, చత్తీస్గఢ్, రాజస్థాన్ ఉదంతాలు దీనికి నిదర్శనం. ఏమైనా సీఎంల మార్పు విషయంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అనిపించుకుంటున్నాయి.
Also Read : బీజేపీకి బిగ్ షాక్: బాబుల్ సుప్రియో రీఎంట్రీ