iDreamPost
iDreamPost
గ్రామ సచివాలయాల ద్వారా మరింతగా పారదర్శక సేవలు అందించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఓ ఆర్జీ పరిష్కారానికి సంబంధించి దరఖాస్తు ఎప్పుడు, ఏ అధికారి వద్ద ఏ దశలో ఉందన్న వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయనుంది. దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు ఎస్సెమ్మెస్ రూపంలో తెలియజేసే ప్రక్రియను తెస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0’ని గురువారం ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని సచివాలయాల్లో అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది. మీ–సేవా కేంద్రాలలో సైతం అందుబాటులో లేని 220కి పైగా కొత్త సేవలు సచివాలయాల్లో ఉన్నాయి. 2020 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు సచివాలయాల ద్వారా 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయి.
సచివాలయాల్లో ఆర్జీలను వివిధ ప్రభుత్వ శాఖల పోర్టల్‌కు అనుసంధానిస్తున్నారు. ఆర్జీ పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఆ సమాచారం సచివాలయ సిబ్బందికి తెలియడం లేదు.. కేవలం సంబంధిత శాఖ పరిధిలోనే ఆ వివరాలు ఉంటాయి. అంతేకాదు అర్జీదారుడికి దరఖాస్తుకు సంబంధించి వివరాలు సచివాలయ సిబ్బంది చెప్పలేకపోతున్నారు. ఈ ఇబ్బందులన్నీ అధిగమించడానికి ఆన్‌లైన్ ద్వారా అందజేసే సేవలన్నింటిని ఒకే పోర్టల్ పరిధిలోకి తెస్తున్నారు. ఇలా చేయడం ద్వారా సచివాలయాల సిబ్బందికి ఆర్జీల పురోగతికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.