iDreamPost
iDreamPost
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత నెలలో రాయలసీమను భారీ వర్షాలు ముంచెత్తాయి. అంచనాలకు మించి కురిసిన వర్షంతో అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోవడం వంటి ఘటనల వల్ల ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. 140 ఏళ్ల తరువాత భారీ వర్షాలతో వరద విరుచుకుపడింది. స్పిల్ వే సామర్థ్యానికి మించి వరద రావడంతో మట్టికట్ట తెగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తుపై సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి బాధితులకు అన్నివిధాలుగాను సహాయ, సహకారాలందించారు. వారు త్వరితగతిన కోలుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నారు.
తాజాగా ఇటువంటి విపత్తులను ఎదుర్కొనేందుకు నడుంబింగించారు. రాష్ట్రంలో వివిధ మేజర్, మీడియం ప్రాజెక్టులు, రిజర్వాయర్ల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. తన కార్యాలయంలో గురువారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్వహణ, భద్రత వంటి విషయాలపై దిశానిర్ధేశం చేశారు.
అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపడిన ఘటనతో ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మేజర్, మీడియం రిజర్వాయర్లు, ప్రాజెక్టుల భద్రత, నిర్వాహణకు ప్రణాళికలు సిద్ధం చేయనుంది. రాష్ట్ర విభజన తరువాత వీటి నిర్వహణను గత టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అప్పట్లో వివిధ కమిటీలు చేసిన సూచనలను పక్కనబెట్టింది. దీనితో మట్టికట్టలు, స్పిల్‌వే వంటివి బలహీనపడుతున్నాయి. ఈ కారణంగా పెను ప్రమాదాలకు ఇవి కారణమవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల వద్ద సమగ్ర పరిశీలన చేయనున్నారు. తక్షణం చేయాల్సిన పనులు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన పనులపై గతంలో నియమించిన కమిటీలు నివేదికలు తయారు చేయనున్నాయి.
Also Read : Tirupati Women, CM YS Jagan, Cell Phone – తిరుపతి మహిళకు ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎం జగన్
ప్రాజెక్టులు, రిజర్వాయర్ల వారీగా నిర్వహణ కోసం తగినంత సిబ్బందిని నియమించుకోవాలని సీఎం ఆదేశించడంతో అధికారులు దీనిపై కూడా కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జలవనరులు శాఖ ఇంజనీర్ ఇన్ ఛీప్‌లతో కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఐఐటీ, జేఎన్‌టీయూ నిపుణుల కమిటీకి జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ కమిటీ కూడా తీసుకోవాల్సిన చర్యలను సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీకి తెలియజేయనుంది.
వివిధ ప్రాజెక్టుల నిర్వహణపై గత ప్రభుత్వాల హాయాంలో ఇచ్చిన నివేదికలను కూడా అత్యున్నత స్థాయి కమిటీ పరిశీలించనుంది. తాజాగా వచ్చిన వరదలను, కుంభవృష్టి వర్షాన్ని పరిగణలోకి తీసుకుని ఆ మేరకు తగిన సూచనలు చేస్తుంది. ఆటోమేషన్ రియల్ టైం డేటాకు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానించే వ్యవస్థపై కూడా చీఫ్ సెక్రటరీతో కూడిన అత్యున్నత బృందం దృష్టిసారించింది.
అలాగే వాటర్ రెగ్యులేషన్ కోసం కూడా సిబ్బంది నియామకం ప్రతిపాధనలు సిద్ధమయ్యాయి. పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తే ఆస్తినష్టం, ప్రాణనష్టానికి ఆస్కారం ఉన్న లోతట్టు ప్రాంతాలను గుర్తించే పనిని కూడా కమిటీ చేయనుంది. పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తే ముంపు బారిన పడేవారిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ముంపునీరు దిగేందుకు అడ్డుగా ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగింపు వంటి విషయాలను పరిశీలించనున్నారు. తుది నివేదిక సిద్ధమైన తరువాత ప్రభుత్వం రిజర్వాయర్లు, ప్రాజెక్టు భద్రతాపరమైన పనులు చేపట్టనుంది.
Also Read : CM YS Jagan, PRC – దటీజ్ జగన్….చెప్పాడంటే చేస్తాడంతే!