iDreamPost
android-app
ios-app

చంద్రబాబు చేయలేనిది జగన్ చేసి చూపించారు !

చంద్రబాబు చేయలేనిది జగన్ చేసి చూపించారు !

నా అమరావతి.. నా కలల రాజధాని అని ఊదర కొట్టిన చంద్రబాబు తన హయాంలో కనీసం శాసనసభకు ఎక్స్‌ప్రెస్‌ హైవేను వేయలేక పోయారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి, మంత్రివర్గం శాసన సభకు హాజరు కావాలంటే గ్రామాల మీదుగా వెళ్లాల్సిందే. పాత పంచాయతీ రోడ్లే దిక్కు. సింగపూర్ తరహా రాజధాని ఇస్తాంబుల్ తరహా రాజధాని అంటూ అమరావతి మీద రకరకాల మాటలు చెప్పిన చంద్రబాబు కనీసం శాసనసభకు వచ్చేందుకు అనువైన రోడ్డు వేయకపోవడం విశేషం.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం 150 కోట్ల రూపాయలతో ప్రకాశం బ్యారేజ్ ఎగువ నుంచి కుడి కరకట్టను రెండు వరుసల దారిగా చేసేందుకు ప్రయత్నం మొదలైంది. కొండవీటి ఎత్తిపోతల పథకం పంపింగ్ స్టేషన్ నుంచి 15 కిలోమీటర్లు మేర ఈ పనులు జరుగుతాయి. రాయపూడి గ్రామం వరకు కరకట్టను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. శాసనసభ, సచివాలయానికి కలుపుతూ సాగే ఈ రోడ్డు వల్ల పరిపాలనాపరంగా శాసనసభకు వెళ్లడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇది శాసనసభ సచివాలయం నిర్మించిన సమయంలోనే చేయాల్సిన పని. అయితే కేవలం సాధారణ మార్గాలను అభివృద్ధి చేసి గ్రామాల మీదుగా రోడ్డు సౌకర్యం కల్పించారు తప్పితే, శాసనసభ కు వెళ్లేందుకు ప్రత్యేకమైన అనువైన దారి లేదు.

మూడు రాజధానుల అంశంతో ముందుకు వెళ్తున్న వైయస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే శాసన రాజధానిగా అమరావతి పేరును ప్రకటించింది. దీనికి తగినట్లుగానే శాసనసభ కు వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను నిర్మించే పనుల్లో భాగంగా ఈ పనులను ప్రభుత్వం మొదలు పెట్టింది. శాసనసభ నిర్మించిన సమయంలోనే దానికి తగిన అనువైన మార్గాలను ఎంచుకోవడంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామాల మీదుగా ఇరుకు రోడ్ లోనే శాసనసభకు రాకపోకలు సాగించారు. పంచాయితీ, గ్రామ సడక్ రోడ్ లోనే కాస్త పెద్దవి చేసి వినియోగించుకున్నారు. అందులోనూ చాలా వరకు రహదారులు గ్రామాల మధ్య నుంచి వెళ్లడంతో శాసనసభకు వెళ్లే సమయంలో, శాసన సభ జరిగే సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. అందులోనూ గ్రామస్తులను పదే పదే ఇబ్బంది పెట్టే పరిస్థితి పోలీసులకు ఏర్పడుతోంది.

కరకట్ట మార్గం పూర్తయితే పూర్తి భద్రత చర్యలతో శాసనసభ కు వెళ్లేందుకు అనువైన మార్గం ఏర్పడుతుంది. మంత్రులు, శాసనసభ్యులతో పాటు అధికారులు సైతం వెళ్లేందుకు వీలైన దారి దొరుకుతుంది. కరకట్ట కుడివైపు మార్గం లోకి ప్రవేశించి..10 కిలోమీటర్లు ప్రయాణం చేయగానే శాసనసభ చేరుకునేలా చక్కటి దారి అందుబాటులోకి వచ్చినట్లే. ప్రతి విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చూపించే తెలుగుదేశం పార్టీ ఈ కరకట్ట విషయం మాత్రం మరచిపోయింది. కనీస అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు సైతం ఇక్కడ నివాసం ఉన్నప్పటికీ ఈ మార్గం ఎప్పటికీ సింగిల్ లైన్ దారి గానే కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఈ మార్గాన్ని విస్తరించాలని భావిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల విమర్శలకు దిగుతుండడం వారి నైతికతకు నిదర్శనంగా భావించవచ్చు.

Also Read : షర్మిళా ఇంటి ముందు ధర్నా నాటకం లక్ష్యం ఏమిటీ..?