iDreamPost
android-app
ios-app

ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారులకు ఊహించని బహుమతి ప్రకటించిన సీఎం జగన్‌

ఇళ్ల పట్టాల పంపిణీలో లబ్ధిదారులకు ఊహించని బహుమతి ప్రకటించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో పేద, మధ్యతరగతి వారి సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాకారం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో చివరి లబ్ధిదారుడుని గుర్తించిన జగన్‌ ప్రభుత్వం ఈ రోజు 30.75 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరిలో పలువురు లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను సీఎం వైఎస్‌ జగన్‌ అందించారు. రాబోయే రెండు వారాల్లో అంటే జనవరి ఏడు వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారులుగా ఎన్నికైన 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వడంతోపాటు.. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఉచితంగా ఇళ్ల స్థలంతోపాటు ఇళ్లు కూడా కట్టించి ఇవ్వనున్నారు.

ఇళ్ల పట్టాలు పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ కొమరిగిరిలో నిర్మించిన మోడల్‌ హౌస్‌ను పరిశీలించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో వంట గది, హాలు, బెడ్‌రూమ్, మరుగుదొడ్డితో సహా సకల సౌకర్యాలతో ఇంటిని ప్రభుత్వం నిర్మించి ఇవ్వనుంది. దీనికి 1.80 లక్షల రూపాయలు ప్రభుత్వం వెచ్చించబోతోంది. 2 దశల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చిన 30.75 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నారు.

ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తన ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇళ్లు ఇచ్చే అదృష్టం దేవుడు తనకు ఇచ్చాడని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. ఇంతకంటే తనకు భాగ్యం ఏముంటుందన్నారు. పాదయాత్రలో పేదలు, కొన్ని వర్గాలు ప్రజలు సొంత ఇళ్లు లేక పడుతున్న బాధలు కళ్లారా చూశానని సీఎం జగన్‌ గుర్తు చేసుకున్నారు. దశాబ్ధాలు తరబడి ఉన్న ఈ పరిస్థితిని మార్చాలని ఎన్నికల మేనిఫెస్టోలో 25 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తామనే హామీని ఇచ్చినట్లు పేర్కొన్నారు. 25 లక్షలంటే.. అంతకు మించి 30.75 లక్షల ఇళ్లు పేద, మధ్య తరగతి ప్రజలకు కట్టించబోతుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

ఇళ్ల స్థలాలు ఇచ్చే చోట ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమదేనన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. ఆయా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, వైఎస్సార్‌ జనతా బజార్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంక్షన్‌ హాళ్లు, పార్కులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం సైజును కూడా పెంచుతున్నామన్నారు. ముందుగా నిర్ణయించినట్లు 224 చదరపు అడుగులకు బదులుగా 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించబోతున్నట్లు వెల్లడించిన సీఎం జగన్‌ లబ్ధిదారులకు ఊహించని బహుమతిని ప్రకటించారు. కట్టించబోయే ఇంటిలో బెడ్‌రూం, హాల్, కిచెన్, వరండా, మరుగుదొడ్లు, సింటెక్స్‌ ట్యాంక్, రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు ఉంటాయని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఆహ్లాదకరంగా ఉండేందుకు అన్ని లేఅవుట్లలో 13 లక్షల మొక్కలు నాటించబోతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది రెండో దశలో మిగిలిన వారికి ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.