iDreamPost
iDreamPost
మీడియా కథనాలు, ప్రతిపక్షాల విమర్శలకు పెద్దగా స్పందించడానికి జగన్ సుముఖత చూపరు. ఇష్టారాజ్యంగా రాసే రాతలను అసలు ఖాతరు చేయరు. కానీ తాజాగా ఈనాడు పత్రిక మొదటిపేజీలో రాసిన రాతలను ఆయన సీరియస్ గా తీసుకున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల మృతి అన్నట్టుగా వచ్చిన కథనంపై మండిపడ్డారు. కోవిడ్ పరిస్థితిపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి ఆళ్ల నానితో పాటుగా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ఫ్యూ కొనసాగింపు విషయంలో సవరణలు చేశారు. కొన్ని మార్పులు కూడా చేశారు.
అదే సమయంలో సీఎం ఆశ్చర్యకరంగా ఈనాడు రాతలపై స్పందించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రానికి మంచిపేరు వస్తుందని, దీన్ని తట్టుకోలేక తప్పుడు రాతలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. సమీక్ష సందర్భంలో కొందరు అధికారులు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించగా సీఎం స్పందిస్తూ ఈమాటలు అన్నారు. ఈరెండు కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు తెలిపారు.
Also Read : జగన్ పై దీర్ఘకాలిక కుట్రకు తెరలేపిన ఆంధ్రజ్యోతి, బరితెగించిన ఆర్కే
ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించడానికి ఇలాంటి వార్తలు రాస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి వార్తల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘ఆంధ్రజ్యోతి’’ పత్రికలో ఉద్దేశపూర్వకంగా రాసిన కొన్నిరాతలనుకూడా తన దృష్టికి తీసుకు వచ్చారని సీఎం తెలిపారు.
“కోవిడ్‌పై సమీక్షా సమావేశం సందర్భంగా ఇంతమంది అధికారులముందు కరోనా లేదని నేను అన్నట్టుగా, చులకనగా చూశానంటూ రాతలు రాసిన విషయాన్ని నాకు తెలిపారు. నన్ను కోట్‌చేస్తూ ఈ మాటలు రాశారని చెప్పారు. ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతున్నారు ఇలాంటి రాతలు ద్వారా ముఖ్యమంత్రి అనే పదవికి విలువ తగ్గించి, దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళ్తున్నారు. అసలు వీళ్లు మనుషులుగా ప్రవర్తిస్తున్నారా? కోవిడ్ నివారణా చర్యలపై ఇంత సీరియస్‌గా సమీక్షలు చేస్తుంటే.. వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయడం అత్యంత దురదృష్టకరం” అంటూ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.
ఇంతమంది అధికారులకు టైంపాస్‌కాక ఇలాంటి రివ్యూలకు హాజరవుతున్నారా? అని నిలదీశారు. కరోనా మీద ప్రభుత్వం సీరియస్‌గా లేకపోతే వారానికి రెండురోజులపాటు సమీక్షలు చేస్తుందా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి రాతలు రాసేముందు కనీసం ఎక్కడోచోటైనా విలువలు ఉండాలి కదా?మీకు ఏది రాయాలనిపిస్తే అలా రాస్తారా? అంటూ సీఎం ఎదురుదాడికి దిగారు. తాజాగా సీఎం చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. సుదీర్ఘకాలంగా సహనంతో ఉన్న సీఎం కూడా చివరకు ఓపిక నశించి ఘాటుగా స్పందించాల్సిన స్థితి వచ్చిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read : అవసరాలకోసం అడ్డదారులు తొక్కే విలన్లేనా అంతా?RK కొత్తపలుకులు అర్థమేమిటి?