Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటన తర్వాత సీఎం తిరిగి రాష్ట్రానికి వచ్చారు. వారం క్రితమే జరగాల్సిన పర్యటన.. హోం మంత్రి అమిత్ షాకు అర్థంతరంగా అత్యవసరమైన పని పడడం వల్ల పడింది. నిన్న గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సీఎం వైఎస్ జగన్.. పలువురు కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
వాయిదా పడిన పర్యటపై అవాకులు చవాకులు పేలిన ప్రతిపక్ష పార్టీ నేతలకు.. వారం తిరగకముందే మళ్లీ సీఎం పర్యటన ఖరారు కావడం వారికి ఏ మాత్రం రుచించలేదు. ఆయా మంత్రులు, అధికారులతో భేటీ సందర్భంగా సీఎం జగన్ చర్చించిన అంశాలను మరుగునపడేలా టీడీపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతున్నారు. సొంత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారంటూ టీడీపీ సీనియర్‌నేత, ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు మైకందుకున్నారు. జగన్ పర్యటనపై ఆ పార్టీ నేతల కన్నా.. టీడీపీ నేతలు ఎక్కవ ఆసక్తి కనబరుస్తున్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు, విభజన చట్టంలోని అంశాలను సీఎం వైఎస్ జగన్ హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది 2022 జూన్‌లోపు పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలంటూ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు విన్నవించారు. పెండింగ్ నిధులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలింపు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రథాన్‌తో భేటీ సందర్భంగా విన్నవించారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన ఆవశ్యకతను మంత్రికి వివరించారు. సివిల్ సప్లై శాఖకు కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీ బియ్యం బకాయలు 3,229 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిపోయిన చిన్నపాటి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని మంత్రి జవడేకర్‌తో భేటీ సందర్భంగా సీఎం జగన్ విన్నవించారు. మంత్రులతోపాటు వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, సీఈవో అమితాబ్‌కాంత్‌లతోనూ చర్చించారు.
Also Read : జగన్ పర్యటన ఎందుకో ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా..?