దుబ్బాక ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి సారించాలని పార్టీ నేతలకు మంత్రులకు పిలుపునిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం ప్రగతిభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై 17 మంది మంత్రులు, 18 మంది పార్టీ ప్రధాన కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తర్వాత మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
డిసెంబరులో GHMC ఎన్నికలు జరుగుతాయని దీపావళి అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని నోటిఫికేషన్ విడుదల అనంతరం మరో రెండు వారాల్లో ఎన్నికలను నిర్వహిస్తామని సీఎం కెసిఆర్ వెల్లడించారు. ఎన్నికల ఇన్‌ఛార్జిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకలో ఊహించని రీతిలో బీజేపీ గెలిచిందని, రూరల్ ఏరియాల్లోనూ ఆ పార్టీ బలపడుతోందని, రూరల్ ఏరియా అయిన దుబ్బాకలో బీజేపీ గెలుపును ఆషామాషీగా తీసుకొవద్దని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్ ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 డివిజన్లు గెలుచుకునేలా ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంత్రులు సహా ముఖ్య నేతలను డివిజన్‌కో ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తాం. ఎన్నికల్లో పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని ఖచ్చితంగా గెలిచే వారికే టికెట్లు ఉంటాయని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ తర్వాత రెండో పెద్దనగరమైన వరంగల్ కార్పొరేషన్‌తో పాటు ఖమ్మంలోనూ గెలిచేందుకు సన్నద్ధం కావాలని కేసిఆర్ సూచించారు.
కాగా సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాకు లీక్ చేయవద్దని సీఎం కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. సమావేశంలో చర్చించిన అంశాలు బయటకు పొక్కితే కఠిన పరిణామాలు ఉంటాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది. ఎన్నికలకు ముందుగా సన్నద్ధం కావాలని పార్టీ నేతలను హెచ్చరించడం సుదీర్ఘ భేటీ జరపడం లాంటి అంశాలను బట్టి గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి దుబ్బాకలో తగిలిన ఎదురుదెబ్బను మరిచిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు.