iDreamPost
android-app
ios-app

బ‌ర్త్ డే గిఫ్ట్ : కేసీఆర్ కు ‘కోటి వృక్షార్చన’

బ‌ర్త్ డే గిఫ్ట్ : కేసీఆర్ కు ‘కోటి వృక్షార్చన’

ఈ నెల 17 తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ నాయ‌కుడికీ జ‌ర‌గ‌ని రీతిలో వినూత్నంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు టీఆర్ఎస్ యంత్రాంగం కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ భారీ క‌టౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే క్ర‌మంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో ‘కోటి వృక్షార్చన’ పేరుతో మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేశారు. సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా బుధవారం ఉదయం ఒక గంటలో కోటి మొక్కలు నాటాలని సంకల్పించారు. తెలంగాణలో మాత్ర‌మే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 50దేశాల్లో కోటి వృక్షార్చన నిర్వహించనున్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి విపత్తుల నుంచి సమస్త మానవాళిని కాపాడడానికి తమ వంతుగా చేయాల్సిన బాధ్యతను ఈ కార్యక్రమం గుర్తు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు జన్మదిన కానుక ఇవ్వాలని సినీ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి, ప్రిన్స్ మ‌హేష్ బాబు వంటి అగ్ర తార‌లు కూడా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళాడాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, దాన్ని నేరవేర్చేందుకు ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఓ ప్రకటనలో కోరారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం ద్వారా కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ట్విట్‌ చేశారు. ఎంపీ సంతోష్‌ చేపట్టిన కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కోరారు. మొక్కలు నాటడం ద్వారా సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

రెండున్నర కిలోల బంగారు చీర

కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. జ‌న్మ‌దిన వేడుక‌ల కోసం జ‌ల‌విహార్ లో వేదిక ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ తెలిపింది. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత కూన శ్రీ‌శైలం గౌడ్ రెండున్నర కిలోల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేయించిన చీరను కేసీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి ఇవ్వ‌నున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, త‌ల‌సాని చేతుల మీదుగా సమర్పించనున్నట్టు వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బుధవారం ఉదయం 6గంటలకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం, 9 గంటలకు మృత్యుంజయ హోమం, ఆయుష్షు హోమం, అన్నప్రసాద పంపిణీ ఉంటుందన్నారు. పారాయణం చేసిన 300మహిళలకు చీరలు అందజేస్తామని చెప్పారు.

ఇప్ప‌టికే కేసీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన డాక్యుమెంటరీ ట్రైలర్‌ను మంత్రి విడుదల చేశారు. కేసీఆర్‌ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ముఖ్యమంత్రిగా అమలు చేసిన పథకాలు తదితర అంశాలను వివరిస్తూ రూపొందించిన 30 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీని విడుద‌ల చేశారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రారంభమైన కోటి కుంకుమార్చన రేపటి వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. 17న నవగ్రహ, ఆయుష్షు హోమం ఉంటుందని, కోటి కుంకుమార్చనలో పాల్గొన్న 250 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌ గణేష్‌ ఆలయంలో గణపతి కల్యాణం, విశేష అభిషేకాలు, అన్న ప్రసాద పంపిణీ ఉంటుందన్నారు. నాంపల్లిలోని హజ్రత్‌ యూసిఫెన్‌ దర్గాలో చాదర్‌ సమర్పించడంతోపాటు పరిసర ప్రాంతాల్లో పండ్ల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. అమీర్‌పేటలోని గురుద్వార్‌లో గురుగ్రంథ్‌ సాహెబ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి, శాలువాను కేసీఆర్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పార్శిగుట్ట మధురానగర్‌లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మ వారికి బంగారు కవచం అలంకరించి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నామన్నారు. బోయిగూడలోని వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీతోపాటు అన్నదానం, గాంధీ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. మోండా మార్కెట్‌ డివిజన్‌లోని ఎస్‌పీజీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు వివరించారు.