iDreamPost
android-app
ios-app

ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న తీరు అభినందనీయం

ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న తీరు అభినందనీయం

కరోనా రక్కసి చైనా నుండి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తున్న తొలి రోజులవి.. ఆకస్మికంగా ఎవరూ ఊహించని విధంగా కేంద్రం దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో కరోనా సోకిన వారిని అంటరాని వారిగా, ఎవరైనా దగ్గినా తుమ్మినా ప్రజలంతా అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. ఈ దశలో కరోనా రోగుల్ని అంటరాని వారిగా చూడొద్దని,కరోనా వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్ వీధుల్లో చల్లాలని, కరోనా తగ్గడానికి పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందని ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి గురయ్యాయి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజారోగ్యం పట్ల ఉన్న శ్రద్దతో ఎంతో ముందుచూపుతో ఆయన చేసిన వ్యాఖ్యల్లో భావాన్ని పట్టించుకోకుండా కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఆనందించారు. కానీ చివరికి ఆ ముఖ్యమంత్రి చెప్పిన పారాసిట్మాల్ నే కరోనా చికిత్స కోసం డాక్టర్లు వాడమని చెప్పడంతో ఆ ట్రోలింగ్స్ పక్కన పెట్టి అదే మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది.

కరోనా రాష్ట్రంలో ఉగ్రరూపం దాల్చి విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చేరినప్పుడు కూడా ప్రజలు కృంగిపోకుండా వారికి ధైర్యం చెబుతూ,కరోనా పేరుతో ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి తన గొప్ప మనసును చాటుకున్నారు అదే ముఖ్యమంత్రి. కరోనా రోగులకు శుచి,రుచికరమైన భోజనాన్ని అందిస్తూ కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ, రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయినప్పటి నుండి తొలి కరోనా వ్యాక్సిన్ వేసే వరకూ కరోనా కట్టడి విషయంలో ఆయన అనుసరించిన మార్గం ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజల మనసులు గెలుచుకున్న ఆ ముఖ్యమంత్రి మరెవరో కాదు ఏబీపీ–సీఓటర్‌ సంస్థ నిర్వహించిన “దేశ్‌ కా మూడ్‌” సర్వేలో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో ముఖ్యమంత్రి జగన్ అనుసరించిన తీరు నిస్సందేహంగా అభినందించదగినదే. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ మరియు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా ఈ కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా దగ్గరుండి సమీక్షించడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారికి తొలి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ స్వదేశీ వ్యాక్సిన్ ని తయారుచేసిన శాస్త్రవేత్తలను ప్రశంసించారు.

కరోనా వ్యాక్సిన్ తొలిసారిగా తీసుకునే విషయంలో అనేక అపోహలు ఉండొచ్చు. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తుతాయేమో అని టీకా తీసుకునేవారు భయపడుతూ ఉండొచ్చు. అలాంటి సమయంలో దగ్గర ఉండి ధైర్యం చెప్పే నాయకులు ఎంతమంది ఉంటారు.? ముఖ్యమంత్రి జగన్ చేసింది అదే. టీకా తీసుకునే సమయంలో దగ్గరుండి ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించే నాయకులు తక్కువగా ఉంటారు. కానీ ప్రపంచాన్ని కుదిపేసిన వ్యాధి రాష్ట్రంలో ప్రబలినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ కరోనా పట్ల ప్రజల్లో నెలకొని ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రజల మన్ననలు పొందిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో తొలి టీకా వేయించుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు బి.పుష్పకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సమక్షంలో టీకా వేయించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం తనని ధైర్యంగా ఉండమని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని ఈ ఘటనను తాను జీవితంలో మరిచిపోనని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏది ఏమైనా ప్రజారోగ్యం విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు,అనుసరిస్తున్న తీరు అభినందనీయం..