Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో 2019 శాశ్వతంగా నిలిచిపోతుంది. రాజకీయ నేతలు, ప్రజలు 2003 సంవత్సరాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారో అలాగే 2019ని కూడా అనునిత్యం మననం చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2003లో మండుటెండలో దివంగత ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
అలాగే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలను నేరుగా చూసిన అనంతరం అధికారంలోకి వచ్చిన ఆయన తండ్రి పాలనను తలపించేలా, వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన పథకాలను బలోపేతం చేస్తూ మరో వైపు నూతన పథకాలను అమలు చేస్తూ పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమ పథకాలతో చరిత్ర తిరగరాస్తున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ సీఎం వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజల తలరాత మార్చేలా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు ఏమిటో ఏడాది ముగింపులో ఓ సారి మననం చేసుకుందాం.
ఫించన్లు పెంపు..
2019 మే 30వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే సామాజిక పింఛన్లు పెంచేలా వైఎస్ జగన్ తొలి సంతకం చేశారు. పింఛన్ సొమ్మును మూడు వేల రూపాలయకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాని 2,250లకు పెంచారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 53 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ఫించన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. రాబోవు ఫిబ్రవరిలో నూతన పింఛన్లు జారీ చేయాలని నిర్ణయించారు.
రైతుల సంక్షేమం కోసం..
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలు అమలు చేశారు. పెట్టుబడి సహాయం కింద వైఎస్సార్ రైతు భరోసా పేరుతో 48 లక్షల మంది రైతులకు ఏడాదికి 13,500 చొప్పున నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తున్నారు. మూడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరికరణ నిధితో మార్కెట్‌లో ధరలు పతనమైనప్పుడు నేరుగా ప్రభుత్వమే పంట కొనుగోలు చేస్తోంది. ఈ ఏడాది టమోటా, మొక్కజొన్న పంటను ఈ పథకం కింద కొనుగోలు చేశారు. రైతులకు రూపాయి ఖర్చు లేకుండా పంట బీమాను ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ రూపాయన్నరకే అంధిస్తోంది. నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరాకు ప్రతి గ్రామ సచివాలయంలో అగ్రిల్యాబ్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం సచివాలయంలో శాశ్వత ప్రతిపాదికన నిపుణుడుని ఉద్యోగిగా నియమించింది.
ప్రజలకు వైద్య భరోసా..
పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యభరోసా కల్పిస్తూ దివంగత సీఎం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీని సీఎం వైఎస్ జగన్ మరింత బలోపేతం చేశారు. వైఎస్‌ఆర్ హయాంలో ఉన్నట్లుగానే ఇతర రాష్ట్రాలలోనూ వైద్యం చేయించుకునే సదుపాయం కల్పించారు. రేషన్ కార్డుతోపాటు ఏడాదికి ఆదాయం ఐదు లక్షల రూపాయలు లోపు ఉన్న కుంటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. జబ్బు ఏదైనా సరే వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా నూతన సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. నూతనంగా ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేయనున్నారు. 3.5 కోట్ల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న వారికి డాక్టర్లు సిఫార్సు చేసిన విశ్రాంతి సమయంలో రోజుకు 225 రూపాయలు లేదా నెలకు గరీష్టంగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు.
చదువులకు అండగా..
ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పేద, మధ్య తరగతి కుంటుంబాల్లోని పిల్లల చదువుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలుతీసుకుంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు ప్రతి తల్లికి జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఏడాదికి 15 వేల రూపాయలు వచ్చే నెల 9వ తేదీన ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. డిగ్రీ ఆపై ఏ కోర్సు చదివినా, ఫీజు ఎంతైనా ప్రభుత్వమే ఫీజు రియంబర్స్‌మెంట్ పథకం కింద ఫీజులు చెల్లిస్తోంది. అంతే కాకుండా ఫీజు రియంబర్స్‌మెంట్ అదుకుంటున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి హాస్టల్ ఖర్చుల కింద ఏడాదికి 20 వేల రూపాయాలు అందిస్తోంది. ఈ పథకాల కింద 11.44 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది.
వాహన మిత్రతో ఆర్థిక సహాయం..
ఆటో, ట్యాక్సిలతో ఉపాధి పొందుతున్న వారికి ఏడాదికి 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాహనం ఇన్య్సూరెన్స్, ట్యాక్స్ తదితర వాటి కోసం నగదును వారి ఖాతాల్లోకే నేరుగా జమ చేశారు. ఈ పథకం కింద దాదాపు 2.36 లక్షల మందికి లబ్ధి పొందారు.
వైఎస్సార్ నేతన్న హస్తం..
చేనేతల జీవన ప్రమాణాలు పెంచేందుకు మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 24 వేల రూపాయలు వైఎస్సార్ నేతన్న హస్తం పథకం కింద ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 73 వేల మందికి లబ్ధి చేకూరింది. ఈ మొత్తాన్ని ఒకే సారి వారి ఖాతాలకు నేరుగా జమ చేశారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం..
మత్య్సకారులకు వేట విరామంలో ఇచ్చే పరిహారాన్ని 4 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచారు. డీజిల్‌పై ఇచ్చే రాయితీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచడంతో 1.35 లక్షల మందికి లబ్ధి చేకూరింది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుంటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పది లక్షలకు పెంచారు.
అగ్రిగోల్డ్ బాధితులకు బాసట..
ప్రైవేటు కంపెనీ అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వమే చెల్లింపులు చేసింది. ఇందు కోసం 1150 కోట్ల రూపాయలు కేటాయించగా మొదటి విడతగా 10 వేల రూపాయల లోపు డిపాజిట్లు ఉన్న 3.70 లక్షల మందికి 263 కోట్ల రూపాయలు చెల్లించారు.
న్యాయవాదులకు దన్నుగా..
జూనియర్ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునే వరకు వారికి నెలకు 5 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఈ పథకం ప్రారంభించారు. జూనియర్ న్యాయవాదులకు మొదటి మూడేళ్లకాలంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారు.
చిరు ఉద్యోగులకు అండగా..
ప్రభుత్వ సేవలు అందిస్తున్న చిరుద్యోగులకు జీవితాల్లో వెలుగులు నింపేలా వారి వేతనాలను అంతకుముందు కన్నా భారీగా పెంచారు.
– ఆశావర్కర్ల జీతాలను మూడు వేల నుంచి పదివేల రూపాయలకు పెంచారు.
– వైద్యశాఖలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలను 8 వేల నుంచి 16 వేలకు పెంచారు.
– హోంగార్డు గౌరవ వేతనాలను 18 వేల నుంచి 21 వేల రూపాయలకు పెంచారు.
– డ్వాక్రా యానిమేటర్ల జీతాలను మూడు వేల నుంచి 10 వేల రూపాయాలకు పెంచారు.
– 108 డ్రైవర్ల జీతాలు 13 వేల నుంచి 28 వేలకు, మెడికల్ టెక్నిషియన్స్ జీతాలు15 వేల నుంచి 30 వేలకు పెంచారు.
– 104 వాహనాల్లోని ఫార్మసిస్ట్, ట్యాబ్ టెక్నీషియన్స్ జీతాలను 17,500 రూపాయల నుంచి 25 వేలకు పెంచారు. డ్రైవర్ల వేతనం 15 వేల రూపాయల నుంచి 26 వేలకు పెంచారు.
– మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం వెయ్యి రూపాయల నుంచి 3 వేలకు పెంచారు.
శాశ్వత అభివృద్ధి, సుపరిపాలన కోసం..
పరిపాలనను కొత్త పుంతలు తొక్కించేలా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేశారు. మరోవైపు శాశ్వత అభివృద్ధి లక్ష్యంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి..
– పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రతి రెండు వేల మందికి ఒక గ్రామ సచివాలయం, పట్టణాలలో ప్రతి నాలుగు వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేశారు. అందులో శాశ్వత ప్రాతిపదికన 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ప్రజలకు సేవ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 2.75 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించారు. వారికి నెలకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తున్నారు.
– నూతనంగా 31 బీసీ కార్పొరేషన్లు, మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.
– ఎస్సీలకు నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తున్నారు.
– పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు ఆ జిల్లా వాసులకే ఇచ్చేలా చట్టం చేశారు.
– వైఎస్సార్ ఆదర్శం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు సబ్సిడీపై వాహనాలు అందజేస్తున్నారు.
– వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. మొదటి విడతలో 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన సహాయం అందజేస్తున్నారు.
– ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనకు మంత్రివర్గం తీర్మానం చేసిది. 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.
– వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ బియ్యం సరఫరా చేసేందుకు నిర్ణయించారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
– విద్యావ్యవస్థలో సమూల మార్పులకు కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేశారు.
– ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. 51 వేల ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
– ప్రతి ఏడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తారు.
– అవినీతి నిర్మూలనకు 14400 నంబర్ ఏర్పాటు చేశారు.
– ప్రజా ధనం ఆదాకు రివర్స్ టెండర్ విధానం అమలు చేస్తున్నారు. తద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారు.
– ప్రభుత్వ పనులలో అవినీతికి తావు లేకుండా టెండర్లకు ముందే హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ పరిశీలన చేయిస్తున్నారు.
– వినియోగదారుల ఇంటికే ఇసుక డోర్ డెలివరీ. వచ్చే నెల ప్రారంభం నుంచి అమలు చేయనున్నారు.
– అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రతిపాదించారు.