iDreamPost
iDreamPost
ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన బొగ్గు కొరత సమస్య ఏపీలో మొదలవుతున్న తరుణంలో కేంద్రం చొరవ చూపి సహాయం అందించాలని ఏపీ సీఎం కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఈ సమస్యపై స్పందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన కోరారు. ఇప్పటికే యూరప్ దేశాలు. చైనా సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎదురవుతున్న బొగ్గు కొరత ఇప్పుడు ఏపీలో కూడా ప్రభావం చూపుతోందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. గడిచిన ఆరు నెలల కాలంలో కరోనా రెండో వేవ్ తర్వాత 15 శాతం డిమాండ్ పెరిగిందని, ఈ ఒక్క నెలలోనే అది 25 శాతం డిమాండ్ పెరగడంతో విద్యుతుత్పాదనకు సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీలో రోజుకి 185 నుంచి 190 మెగా యూనిట్ల డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. మొత్తం విద్యుత్ లో 45 శాతం థర్మల్ విద్యుత్ ద్వారా వస్తోందని ప్రస్తుతం దానికి సంబంధించి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని సీఎం ప్రస్తావించారు. బొగ్గు నిల్వలు తగ్గిపోతున్న తరుణంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పాదనకు ఆటంకం లేకుండా చూడాలని ఆయన కోరారు.
మూడు రెట్లు అదనంగా చెల్లించి విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని సీఎం వివరించారు. కిలోవాట్ కి రూ. 15 చొప్పున చెల్లిస్తున్నామన్నారు. అది యూనిట్ కి రూ. 20కి పెరిగే అవకాశం ఉందని, అయినప్పటికీ సరిపడా విద్యుత్ అందుబాటులో ఉండే అవకాశం కనిపించడం లేదని పీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో తక్షణం స్పందించి పలు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.
ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా తక్షణమే 20 రైల్వే రాకులతో బొగ్గు కేటాయించాలని సీఎం కోరారు. ఏపీలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదనకు అవసరమైన ఇంధనం సరఫరా చేయాలని కోరారు. 500 మెగా వాట్ల విద్యుత్ ని కేంద్రం కేటాయించాలన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందకు డిస్కమ్ లకు అదనంగా నిధుల సేకరణకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని ఆయన పీఎంకి విన్నవించారు.
Also Read : డ్రగ్స్ నిజాలు బయటపెట్టిన ఎన్ఐఏ.. బాబూ, ఆయన బ్యాచ్ ఇప్పుడేమంటుందో..?