Idream media
Idream media
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆది నుంచీ స్థానిక సంస్థల బలోపేతంపైనే దృష్టి సారించారు. రాష్ట్ర అభివృద్ధికి మూలాలు స్థానికంగానే ఉంటాయని బలంగా నమ్మారు. స్థానిక సంస్థలు బలోపేతం అయితేనే ఆయా రాష్ట్రాల అభివృద్ధి పునాదులు బలంగా ఉంటాయని మహాత్మగాంధీ మొదలు.. మేధావులెందరో వెల్లడించిన వాస్తవం అది. ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ అంతగా దృష్టి పెట్టిన దాఖలాలు అంతంత మాత్రమే. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టిన జగన్.. తాజాగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును అక్కడే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఖర్చు చేస్తామని సంచలన ప్రకటన చేశారు.
మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేశారు.
విప్లవాత్మక సంస్కరణలు పట్టణ స్థానిక సంస్థలైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించి, మరింత అభివృద్ధి జరిగేలా ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రూపొందించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఎక్కడా.. ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. శానిటేషన్, వాటర్ అండ్ సివరేజీ నిర్వహణ పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులను శుభ్రం చేయాలి. డ్రైనేజీలను తరుచూ క్లీన్ చేయాలి. ఇందుకోసం స్వల్ప మొత్తంలో యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చునని చెప్పిన జగన్.. శానిటేషన్, వాటర్ అండ్ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్ ఎం) మాత్రమే చార్జీలుగా వసూలు చేయాలని ఆదేశించారు.
అంతా ప్రణాళికబద్ధంగా..
మున్సిపాలిటీలలో కార్యక్రమాలన్నీ ఓ ప్రణాళికాబద్ధంగా జరిగేలా చూసేందుకు జగన్ కొన్ని సూచనలు చేశారు. మున్సిపాలిటీ ఆదాయం ఎంత? వ్యయం ఎంత? జీతాల కోసం, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించి.. దానికనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవలందించడంతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా ఎస్‌ఓపీ ఉండాలన్నారు. జగన్ అనుసరిస్తున్న ఈ విధానాలను రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆయన అనుసరిస్తున్న తీరు.. ఆలోచనా విధానాలు రాజకీయ విశ్లేషకులను సైతం అబ్బురపరుస్తున్నాయి.