ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చేవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడీని కలవనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ చేరే అవకాశముందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
అటల్ బిహారీ వాజ్పాయ్ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో 33కు పైగా పార్టీలు మిత్రపక్షాలుగా ఉండేవి. నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తరువాత ఇప్పటివరకు 26 పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చాయి. కొన్ని రోజుల కిందట ‘మహ’ ఎన్నికల ముందు బీజేపీతో శివసేన తెగతెంపులు చేసుకుంది. తాజాగా కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా శిరోమణి అకాలీదళ్ కూడా కూటమి నుంచి బయటికి వచ్చింది. దీంతో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన పార్టీల సంఖ్య 28కి చేరింది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ పార్టీ కూడా నేడో రేపో కూటమి నుంచి బయటికి రానుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తమకు నమ్మదగిన మిత్రుడు కోసం అన్వేషిస్తోంది.
వైసీపీతో దోస్త్
జేడీయూ తప్పా బలమైన పార్టీ కూటమిలో లేకపోవడంతో ఎన్డీఏ కొత్త మిత్రుల అన్వేషణలో ఉంది. తమ నమ్మదగిన భాగ్యస్వామిగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ వైపు చూస్తోంది. 22 పార్లమెంట్ స్థానాలు, 6 రాజ్యసభ స్థానాలు ఉన్న వైసీపీని ప్రభుత్వంలోకి చేర్చుకోవాలని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. ఈ మేరకు కేంద్ర అధినాయకత్వం ఏపీ, బీజేపీ నాయకుల నోళ్లకు తాళాలు వేసిందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ తో హోంమంత్రి అమిత్ షా రెండు దఫాలు ఈ విషయంపై చర్చ జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో చేరకుండా బయటనుంచి తమ మద్దతు తెలుపుతామని జగన్ చెప్పినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అందుకు ఒప్పుకోని అమిత్ షా ప్రభుత్వంలో చేరమని కోరినట్లు ఢిల్లీ వర్గాల నుంచి వార్తలు వినబడుతున్నాయి. కానీ జగన్ ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
మూడు కేంద్రమంత్రి పదవుల ఆఫర్
ఈ నేపథ్యంలోనే జగన్ కు ప్రధాని మోడీ నుంచి పిలుపువచ్చినట్లు సమాచారం. ప్రభుత్వంలో చేరితే వైసీపీకి మూడు కేంద్రమంత్రి పదవుల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో విజయసాయి రెడ్డి, బాల శౌరి, నందిగం సురేష్ లకు ఈ పదవులు దక్కనున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. కానీ జగన్ ప్రభుత్వంలో చేరితే తమకు కలిగే లాభ నష్టాల మీద బేరీజు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం చేతులు చాస్తున్న చంద్రబాబుకు బ్రేకులు వేసేందుకు కూడా ప్రభుత్వంలో చేరాలని జగన్ పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలే కష్టాలలో ఉన్న రాష్ట్రానికి వనరులు రూపంలో లాభం చేకూరాలంటే ప్రభుత్వంలో చేరమని జగన్ కు నిపుణులు సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమీకరణాల మధ్య ప్రభుత్వంలో వైసీపీ చేరే అవకాశముందంటూ అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రధాని నుంచి కలవమని పిలుపురావడంతో ఈ పర్యటనలో ఏదోక నిర్ణయం జగన్ తీసుకోకతప్పదని చర్చ జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే వచ్చేవారం వరకు ఆగవలసిందే.