iDreamPost
android-app
ios-app

తీరనున్న బెజవాడ వాసుల చిరకాల వాంఛ 

  • Published Mar 31, 2021 | 1:59 AM Updated Updated Mar 31, 2021 | 1:59 AM
తీరనున్న బెజవాడ వాసుల చిరకాల వాంఛ 

విజయవాడలోని అనేక ప్రాంతాలు కృష్ణా నది వరదల్లో మునిగిపోతూనే ఉంటాయి. ప్రతియేడాది నదికి వరదలు వచ్చాయంటే బెజవాడలో అటు భవానీపురం నుండి ఇటు యనమలకుదురు వరకు వందల, వేల ఇళ్ళు మునిగిపోతాయి. లక్షల మంది నిరాశ్రయులవుతారు. ఇది నదికి వరదలు వచ్చిన ప్రతి యేడాది చూసే చిత్రమే. ప్రజలు పడవలు వేసుకుని తిరగడం, చిన్న పిల్లలు, మహిళలు టైర్లు, దుంగలు నీళ్ళలో వేసి వాటిపై తిరగడం వరదలు వచ్చిన ప్రతిసారి కనిపించే దృశ్యం. 

నదికి వరదలు రాగానే, కొన్ని కుటుంబాలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, చాలా కుటుంబాలవారు అక్కడే ఉండి చివరికి వరదల్లో అన్నీ కొలిపోవడం కూడా పరిపాటి అయింది. ప్రధానంగా కృష్ణలంక ప్రాంతం అధికభాగం నదీగర్భంలోనే ఉండడంతో నదికి వచ్చే వరద కొన్ని వేల ఇళ్ళను ముంచేస్తుంది. కృష్ణలంకతో పాటు రామలింగేశ్వరనగర్ ప్రాంతం కూడా వరదభారిన పడుతూనే ఉంటుంది. అటు భవానీపురం వైపు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. వందలాది కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. 

ఈ మధ్యకాలంలో స్థానిక నాయకులు ఓట్లకోసం కాస్త కక్కుర్తిపడి నదీ గర్భంలోకి కూడా ఇళ్ళను అనుమతించడంతో వరద తాకిడికి నష్టపోయే కుటుంబాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 1980 ప్రాంతంలోనే నది వడ్డున ఇళ్ళ నిర్మాణం అనుమతించరాదని నగరపాలక సంస్థ నిర్ణయించినా స్థానిక నాయకుల ప్రోత్సాహంతో ఇళ్ళు పెద్దసంఖ్యలోనే నిర్మాణం అయ్యాయి. ఇక్కడ 90 శాతం ఇళ్ళు రేకుల షెడ్లు కావడం వల్ల వరదల నష్టం కాస్త తక్కువగానే ఉంటున్నా, వరదనీరు తగ్గే వరకూ వందలమంది ప్రజలు శిబిరాల్లో ఉండాల్సి వస్తోంది. అధికారులకు ప్రతి యేడాది వరదబాధితుల శిబిరాలు నిర్వహించడం కాస్త కష్టంగానే మారింది. 

నది పొడవునా ఓ రిటైనింగ్ వాల్ (గోడ) నిర్మిస్తే వరదనీరు ఇళ్ళల్లోకి రాదని ఇక్కడి ప్రజలు చాలా కాలంగా ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కృష్ణలంక ప్రాంతంలో కొంతమేర ఈ గోడ నిర్మించారు. ఇది కొంత ఉపశమనం కలిగించినా అధికప్రాంతం వరదల్లో మునిగిపోతూనే ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 కాలంలో 2016లో కృష్ణా పుష్కారాల కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి ఎగువన భవానీపురం వరకూ ఇళ్ళను ఖాళీ చేయించారు. దీంతో ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ అవసరం లేకుండా పోయింది. వరదనీటిలో మునిగిపోయే ఇళ్ళనే అప్పటి ప్రభుత్వం తొలగించింది. ఇళ్ళు తొలగించిన స్థానంలో నది వడ్డున మెట్లతో ఘాట్ నిర్మాణం చేయడంతో ఇప్పుడు వరదలవల్ల బ్యారేజ్ కి ఎగువన ఇళ్ళు ముంపునకు గురయ్యే ప్రమాదం తగ్గింది. 

ఇప్పుడు సమస్య బ్యారేజ్ కి దిగువన భ్రమరాంబపురం వరకూ గతంలో గోడ నిర్మించిన కారణంగా వరద ప్రమాదం లేదు. సమస్య భ్రమరాంబాపురం నుండి రామలింగేశ్వరనగర్ వరకూ అంతా ముంపు ప్రాంతమే. వందలు, వేల ఇళ్ళు వరదనీటిలో మునిగిపోతాయి. లక్షల కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారు. వీరి కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు (మార్చి 31, 2021) గోడ నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ గోడ నిర్మాణం అయితే దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న వరద బారినుండి కొన్ని లక్షల కుటుంబాలను కాపాడినట్టే అవుతుంది. ఎంతోకాలంగా వారు కోరుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే వచ్చే జూన్ తర్వాత వరదలతో వీరికి ఎలాంటి ప్రమాదం ఉండదు. 

ఈ గోడ నిర్మాణం ఈ సీజన్లో పూర్తి చేయగలిగితే ఈ ప్రాంతం (విజయవాడ తూర్పు నియోజకవర్గం) ఖచ్చితంగా అధికారపార్టీకి అనుకూలంగా మారుతుంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ ప్రతిపక్ష టీడీపీకి ప్రజలు ఓట్లేశారు. ఈ గోడ నిర్మాణం టీడీపీ అభ్యర్థి తన మానిఫెస్టోలో  ప్రముఖంగా ప్రస్తావించడం కూడా ఆ పార్టీ విజయానికి ఒక కారణం అయింది. అంతకు ముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ గోడ నిర్మాణం పూర్తిచేస్తామని హామీకూడా ఇచ్చారు. ఈ గోడకు అంతటి ప్రాధాన్యత ఉంది. అటువంటి గోడ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయడం అధికారపార్టీకి కలిసొచ్చే అంశం. ఇక్కడి ప్రజలకు ఊపిరి పిల్చుకునే అంశం.