iDreamPost
iDreamPost
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అని తెలిసీ ప్లాంట్ భూములు కాజేసేందుకే జగన్ అమ్మకానికి పెట్టారని అడ్డగోలుగా ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఆయన మాజీమిత్రడు పవన్ కళ్యాణ్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అంటున్నారు. ఉద్యమానికి మద్దతు పేరుతో స్టీల్ ప్లాంట్ ఆవరణలో సభ పెట్టారు.. మంగళగిరిలో దీక్ష చేశారు. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. జగన్ సర్కారు ఏమీ చేయడం లేదన్నట్లు మాట్లాడారు. కానీ ఆయన మాజీ సహచరుడు జేడీ లక్ష్మీనారాయణ మాత్రం సీఎం జగన్ ఉక్కు కర్మాగారం విషయంలో చాలా మంచి సూచనలు చేశారని ప్రశంసించారు. వాటిని అమలు చేస్తే ఆ పరిశ్రమను ప్రైవేటీకరించే అవసరమే రాదని ఆయన హైకోర్టుకు విన్నవించడం విశేషం.
ప్రైవేటీకరణపై న్యాయపోరాటం
నాణ్యతలో, ఉత్పత్తుల్లో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా ప్రైవేట్ కు ధారాదత్తం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను, 11 నెలలుగా జరుగుతున్న ఉద్యమాన్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు వెళుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఉద్యమం జరుగుతోంది.
తెలుగు ప్రజల త్యాగాల ఫలం, సెంటిమెంటుకు ప్రతిరూపంగా ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పలు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి గతంలోనే లేఖ రాశారు. అవసరమైతే కర్మాగారాన్ని తీసుకుని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ప్రైవేటీకరణ నిర్ణయంపై జేడీ లక్ష్మీనారాయణ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. తాజా విచారణలో ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖలోని అంశాలను తన అఫిడవిట్లో ప్రస్తావించారు.
Also Read : ప్రత్యేకహోదా – ఆంధ్రాకు కుదరదు, బీహార్ కు మాత్రం …
సీఎం సూచనలు మీరూ పరిశీలించండి
జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే రెండు దఫాలు విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం గతంలోనే అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కోర్టు కోరినా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ నే తమ అఫిడవిట్ గా పరిగణించాలని తాజా విచారణలో కోర్టును కోరింది. కాగా పిటిషనర్ జేడీ లక్ష్మీనారాయణ మరో అఫిడవిట్ దాఖలు చేశారు.
అందులోనే ప్రధానికి సీఎం జగన్ రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం వాటిల్లితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ కోసం భూములు ఇచ్చిన 8వేల మంది రైతులకు న్యాయం జరగలేదు. ప్రైవేటీకరణ వల్ల వారి హక్కులకు, త్యాగాలకు భంగం కలుగుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని.. వాటిని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో సూచించారని పేర్కొన్నారు.
సీఎం సూచనలు బాగున్నాయి.. చాలా విలువైనవి. దూరదృష్టితో ఆ సూచనలు చేశారు. ఈ విషయంలో కేంద్రానికి సహకరించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆ లేఖను మీరు కూడా ఒకసారి పరిశీలించండి.. కేంద్రాన్ని కూడా ఆలోచించమనండి.. అని లక్ష్మీనారాయణ తన అఫిడవిట్లో కోర్టును కోరారు. జగన్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాల్సిన అవసరమే రాదన్నారు. కాగా విచారణను కోర్టు ఫిబ్రవరి రెండో తేదీకి వాయిదా వేసింది.
Also Read : రేపు విశాఖకు జగన్.. సర్వత్రా ఆసక్తి