iDreamPost
android-app
ios-app

విశాఖ ప్రమాదంపై సీఎం ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..

విశాఖ ప్రమాదంపై సీఎం ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు..

విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు అస్వస్థతకు గురయ్యారని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 11:30 గంటలకు ఫ్యాక్టరీలోని రియాక్టర్‌ వద్ద గ్యాస్‌ లీకేజీ కావడంతో ప్రమాదం సంభవించిందని పేర్కొన్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే ముందు జాగ్రత్తగా కంపెనీని మూసివేయించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికే పరిమితమైందని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఫలితంగా ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఎలాంటి ఆందోళన పరిస్థితులు లేవని అధికారులు సీఎంకు తెలిపారు. కాగా, ప్రమాదంపై అధికారులు చెప్పిన వివరాలు విన్న సీఎం జగన్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు.

విశాఖ సాయినార్‌ ప్రమాదంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన మరువక ముందే ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. విశాఖలో వరుస గ్యాస్‌ లీకేజీలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని చంద్రబాబు వాపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అదుకోవాలని, బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యం అందించానలి చంద్రబాబు డిమాండ్‌ చేశారు.