ఆంధ్రప్రదేశ్ మండలి చైర్మన్ మొహద్ అహ్మద్ షరీఫ్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. గురువారం జరిగిన ఏపీ శాసనమండలి సమావేశం అనంతరం షరీఫ్ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ షరీఫ్… తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అహ్మద్ షరీఫ్ కరుడుగట్టిన తెలుగుదేశం వాది. 35 ఏళ్ల రాజకీయ జీవితం.. నమ్ముకున్న పార్టీలో పదవులు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ రాజకీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ పదవి దక్కింది. జగన్ అంటే.. తెలుగుదేశం పార్టీ ఎగిరెగిరి పడుతుంది. ఆయన మంచి చేసినా కాదు అది చెడే అంటుంది. అటువంటి పార్టీకి చెందిన నేత జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి.
పదవీ విరమణ సందర్భంగా షరీఫ్ తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ రాజధానుల బిల్లు సమయంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఒక దశలో రాజీనామా చేద్దామని నిర్ణయించుకున్నానని, కానీ పదవి వల్ల తనకు చెడ్డపేరు రాకూడదని ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గురించి కూడా ఓ ముఖ్య విషయం చెప్పాల్సి ఉందన్నారు. తనకు సహనం ఎక్కువ అని అనుకున్నానని కానీ.. జగన్ తనకన్నా ఎక్కువ సహనశీలురని కొనియాడారు. ఇందుకు.. మూడు రాజధానుల బిల్లుల ఘటనను ఉదహరించారు.
బిల్లుల వివాదం తర్వాత ఓ కార్యక్రమంలో తాము కలిశామని చెప్పారు. అప్పుడు జగన్ తనను ఆప్యాయంగా షరీఫ్ అన్న అని పలకరించారని ఆ సమయంలో ఎందుకు కలత చెందారని అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రశ్నకు సమాధానంగా.. ‘‘ఇంతకు ముందు ఎప్పుడూ పెద్ద పదవులు చేపట్టలేదు. ఒకేసారి ఎమ్మెల్సీ అయ్యాను. చైర్మన్ అయ్యాను. అందువల్ల ఒత్తిడిని ఎదుర్కొనే క్రమంలోనే కలత చెందాను’’ అని సీఎంకు చెప్పానని అన్నారు. తనను అత్యంత గౌరవంగా చూసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు చైర్మన్. షరీఫ్ వ్యాఖ్యలను బట్టి మూడు రాజధానుల బిల్లుల విషయంలో టీడీపీ ఆయనపై ఒత్తిడి చేసిందన్న విషయం అర్థం అవుతుంది. అలాగే, జగన్ రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలకు పాల్పడరన్న విషయం కూడా అర్థం అవుతోంది.