iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ఏడాది పాలనలో తాజా నిర్ణయం ఆయన కీర్తిని ఇనుమడింపజేసేలా మారింది. తన తండ్రి హయంలో పురుడుపోసుకున్న 108 వాహనాలే ఇప్పుడు జగన్ ఇమేజ్ ని అమాంతంగా పెంచేశాయి. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సాధించాయి. ప్రతిష్టను మరింత పెంచాయి. అంతేగాకుండా టాలీవుడ్ ప్రముఖులు కూడా అనేక మంది జగన్ ప్రభుత్వం మీద ప్రశంసల జల్లు కురిపించడం విశేషం.
తాజాగా డాక్టర్ల దినోత్సవం నాడే రాష్ట్రవ్యాప్తంగా 1088 వాహనాలను రోడ్డెక్కించిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. సామాన్యులతో పాటుగా మేథావులు, జాతీయ మీడియా ప్రముఖులు కూడా జగన్ ని అభినందించారు. రాజ్ దీప్ సర్దేశాయ్ లాంటి ప్రముఖ జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. జగన్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో జగన్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమంటూ కొనియాడారు. వివిధ జాతీయ మీడియా చానెళ్లు కూడా విజయవాడలో జరిగిన ఆ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశేష కవరేజ్ ఇచ్చారు. తొలిసారిగా మొత్తం అన్ని చానెళ్లలోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడం విశేషంగానే చెప్పాలి.
ఇక టాలీవుడ్ నుంచి కూడా జగన్ కి అభినందనల వెల్లువ సాగుతోంది. ఇప్పటికే దర్శకులు పూరీ జగన్నాధ్, గోపిచంద్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత, నటుడు బండ్ల గణేష్ వంటి వారు తమ అబిప్రాయాలను పంచుకున్నారు. జగన్ నిర్ణయం ఎందరికో ఉపయోగపడుతుందని దర్శకుడు గోపీచంద్ మలినేని పేర్కొన్నారు. జగన్ సాధించిన ఘనతకు అభినందనలు తెలిపారు. పూరీ జగన్నాధ్ కూడా తన ట్వీట్ లో జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా తో ప్రపంచమంతా కుస్తీపడుతుంటే జగన్ పల్లెలకు కూడా అంబులెన్స్ లు అందుబాటులో ఉంచే కార్యక్రమం చేపట్టడం అసామాన్యం అంటూ కొనియాడారు. సరైన సమయంలో , సరైన నిర్ణయం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సూపర్ జగన్ సార్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. ఇలా వరుసగా వివిద వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అభినందనలు వెల్లువలా రావడం విశేషంగానే చెప్పాలి.