Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా పలు సామాజిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతో పాటు సామాన్యుల వరకూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు సంఘాలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం కార్యక్రమాలను వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు చేపట్టారు. కరోనా నేపథ్యంలో రక్తం యూనిట్ల కొరతను తీర్చేందుకు పెద్దఎత్తున అభిమానుల రక్తదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, పూణే, బెంగుళూరుల్లోనూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో రక్తదానం చేస్తున్న సంఖ్యను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒకే సారి 10500 యూనిట్స్ రక్తదానం రికార్డ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదుతో ఆ రికార్డ్ అధిగమించే అవకాశం కనిపిస్తోంది. రక్తదానాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవెలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణతో పాటూ….
తెలంగాణలోనూ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌరస్తాల వద్ద కేక్ లు కట్ చేసి ప్రజలకు పంచారు. అలాగే వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు చేపట్టారు. పలు ఆస్పత్రుల్లో బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. వైఎస్ ఆర్ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో ముత్తూట్ ఆరోగ్య సంచారిణి వారి సౌజన్యంతో కూకట్ పల్లిలో బాలాజీనగర్ లో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎక్కువ మంది వినియోగించుకున్నారు. వైద్య శిబిరంలో మధుమేహం, క్రియాటినిన్, కొలెస్ట్రాల్, రక్తపోటు, హెపటైటిస్ – బి తదితర పరీక్షలు నిర్వహించారు. కూకట్ పల్లి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ శిబిరం నిర్వహించారు. అలాగే శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు విధేశాల్లో కూడా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం గమనార్హం. ముఖ్యంగా బెంగళూరులో జగన్ కు అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.
ఆస్ట్రేలియాలో ఘనంగా..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్‌సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు.