iDreamPost
android-app
ios-app

ప్రజా సేవే ప్రథమం.. భిన్నంగా సీఎం వరద ఏరియల్‌ సర్వే..

ప్రజా సేవే ప్రథమం.. భిన్నంగా సీఎం వరద ఏరియల్‌ సర్వే..

ఏదైనా ఒక విపత్తుపై ముఖ్యమంత్రి సమీక్ష, సర్వే చేస్తున్నారంటే అంతకు ముందు రోజు నుంచి అధికారులు సహాయ పునరావాస విధులు పక్కనపెట్టి సీఎం పర్యటనకు సిద్ధమవుతుంటారు. వివిధ రకాల నివేదికలు, గణాంకాలు సిద్ధం చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆలోచించారు. తాను సమీక్ష నిర్వహిస్తే అధికారులందరూ సహాయ పునరావాస విధులు వదిలి రావాల్సి వస్తుండడంతో.. ఆ విధానాన్ని పక్కనబెట్టారు.

గోదావరి నది వరదల కారణంగా ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు ముంపులో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబద్ధం తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ గ్రామాలు, తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతం ముంపులో ఉంది. లంక గ్రామాల్లో ఇళ్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు గోదావరి వరద ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అంతకు ముందు ఆయన ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. తాను ఏరియల్‌ సర్వేకు వెళుతున్నందున అధికారులు ఎవరూ తమ విధులు మానుకుని రావాల్సిన అవసరం లేదన్నారు. వరద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు.

వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, కూరగాయలు తోటలకు తీవ నష్టం వాటిల్లింది. గోదావరి నది పాయల మధ్య ఉన్న కోనసీమలోని కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గల్లో పంట నష్టం సంభవించింది. ముఖ్యంగా ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని లంకల్లో పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. వరద ముంపు తగ్గిన తర్వాతే నష్టంపై అధికారులు అంచనా వేసే అవకాశం ఉంటుంది.

వరద తగ్గిన తర్వాత పది రోజుల్లో పంట నష్టం వివరాలు పంపాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే 2 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సూచించారు. పునరావాస, సహాయ చర్యల్లో ఎక్కడా ఖర్చుకు వెనకాడొద్దని స్పష్టం చేశారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.