ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. జగన్ పాదయాత్ర, నవరత్నాలు, సభల్లో జగన్ ప్రసంగాలను ప్రజలు విశ్వసించడం.. ప్రధాన కారణాలు. తనకు అధికారం ఇస్తే అవినీతి అనేదే కనపడకుండా చేస్తానని జగన్ బహిరంగ సభల్లో చెప్పారు. ఈ మాటపై టిడిపి నేతలు హేళనగా మాట్లాడగా.. ప్రజలు మాత్రం నమ్మారని ఎన్నికల ఫలితాలు చెప్పాయి.
ప్రజలు తనపై నమ్మకంతో అధికారం అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం మాట వినపడకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎదో మాట చెప్పి ఊరుకోకుండా… ప్రతి వారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో సమీక్షలో మళ్ళి మళ్ళి గుర్తు చేశారు. అది అధికారులతో పాటు ప్రజల్లో కి బాగా వెళ్ళింది. క్షేత్ర స్థాయిలో ఆ మాటల ఫలితాలు కనపడ్డాయి.
1,26,728 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీ జరగనున్న సమయంలో తమ కోటగా కొన్ని పోస్టులు వస్తాయని ఎమ్మెల్యేలు, మంత్రులు భావించారు. ఉద్యోగం కావాలని అడిగిన పార్టీ కార్యకర్తలకు ఆ మేర ప్రజాప్రతినిధులు హామీ ఇస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఇప్పుడు జరుగుతుందని అందరూ భావించారు. తమకు ఈ ఉద్యోగాలు రావంటూ టిడిపి సానుభూతి పరుల పిల్లలు దరఖాస్తు కూడా చేయలేదు. ఐతే ఈ అంచనాలు, అనుమానాలు పరీక్షల నిర్వహణ, ఫలితాల తర్వాత పటాపంచలు అయ్యాయి. కొన్ని పోస్టులు మన వాళ్లకు ఇవ్వాలంటూ కొంత మంది మంత్రులు సీఎం జగన్ వద్దకు వెళ్లి అడిగిన.. అయన ససేమిరా అన్నారని ప్రచారం జరిగింది. పూర్తి పారదర్శకత తో సచివాలయ పోస్టులు భర్తీ చేసారని అందరికి అర్ధం ఐనది. దరఖాస్తు చేయని టిడిపి సానుభూతి పరులు తీవ్ర నిరుత్సహానికి గురయ్యారు.
అదే సమయంలో గ్రామ సచివాలయం లో పని చేసేందుకు లైన్ మెన్ పోస్టుల భర్తీకి దక్షిణ, ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థలు దాదాపు 7 వేలకు పైగా పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి . ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు. రాత పరీక్ష లేకపోవడం తో ఈ పోస్టులు ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పిన వారికే ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆశావహులు ప్రజా ప్రతినిధుల వద్దకు క్యూ కట్టారు. సిపార్సులతో వెళ్లి.. ఎన్నికల్లో తాము చేసిన పని చెబుతూ లైన్ మెన్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోస్టు ఇవ్వాలనుకున్న అభ్యర్థుల హాల్టికెట్లు కూడా ప్రజా ప్రతినిధుల అనుచరులు, కార్యాలయ సిబ్బంది సేకరించి పెట్టుకున్నారు. ఐతే ఇక్కడ కూడా ఫలితం తిరగబడింది. ప్రజా ప్రతినిదుల కార్యాలయ సిబ్బంది హల్ టికెట్లు సేకరించిన వారికి ఉద్యోగం రాలేదు. మెరిట్ ఆధారంగా, ఫిజికల్ టెస్ట్ లో వచ్చిన మార్కులు, వయస్సు ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రజా ప్రతినిధులకు శృంగభంగం జరిగిందని చెప్పొచ్చు.
ఇక చివరగా.. లైన్ మెన్ పోస్టులుకు సబ్ స్టేషన్ల లో షిప్ట్ ఆపరేటర్ గా కాంట్రాక్టు విధానం లో పని చేస్తున్న వారు దాదాపు 2 వేల మంది ఎంపికయ్యారు. ఖాళీ ఐన 2 వేల షిప్ట్ ఆపరేటర్ పోస్టులుకు మళ్ళీ సిపార్సులు నడిచాయి. గతంలో ఈ పోస్టులు ఒక్కక్క దానికి 3 నుంచి 5 లక్షల రేటు పలికింది. ఆ మొత్తం ఇచ్చిన వారికే ఎమ్మెల్యే సిపార్సులతో ఆపరేటర్ల పోస్టులు ఇచ్చారు. ఈ సారి ఎమ్మెల్యే సిపార్సులతో వైఎస్సార్ సానుభూతి పరులైన అభ్యర్థుల నియామకాలు జరిగాయి. కొన్ని చోట్ల డబ్బులు తీసుకుని ఇచ్చారన్న ప్రచారం జరిగింది. ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లడం తో ప్రక్రియ నిలిపివేశారు. కొద్దీ రోజుల క్రితం నూతనంగా ఏర్పాటు చేసిన ‘అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్’ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఆయా పంపిణి సంస్థలు అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశాయి. జగన్ సర్కార్ పత్రి విషయంలో పాటిస్తున్న పారదర్శక విధానం వల్ల ప్రజల్లో మంచి పేరు వస్తోంది. ఐతే వైఎస్సార్ సిపి శ్రేణుల్లో మాత్రం ఒకింత నిరుత్సాహం నెలకొంది.పార్టీ కోసం కష్టపడి, అనేక విధాలుగా నష్టపోయిన తమకు కాంట్రాక్జ్, అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా దక్కడం లేదన్న ఆవేదన వారిలో ఉంది.