విశాఖ జిల్లా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీల సందర్భంగా ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, తప్పుడు విధానాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బుధవారం ఆదేశించారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందనేది కూడా తేల్చాలని స్పష్టం చేశారు. ఈ నెల 9న ఏసీబీ డీఎస్పీ, సీఐ, సిబ్బంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి జరిపి.. రూ.61,500 నగదు రిటర్న్ డాక్యుమెంట్ రిజిస్టర్‌లో కనిపించినట్లు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీంతో సబ్ రిజిస్ట్రార్ తారకేష్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేశారు. అయితే, ఏసీబీ అధికారులే బయటి నుంచి డబ్బు తెచ్చి డాక్యుమెంట్ రిజిస్టర్‌లో పెట్టారని, తాము ఎలాంటి తప్పు చేయకపోయినా కేసు నమోదు చేశారని సబ్ రిజిస్ట్రార్ తారకేష్ మంగళవారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీంతోపాటు ఆ రోజు ఏం జరిగిందనే దానిపై సీసీ కెమెరా ఫుటేజీని సైతం ఆయన సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ తదుపరి చర్యలకు ఆదేశించారు.
డీఐజీ సస్పెన్షన్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ విశాఖపట్నం డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) ఎ.రవీంద్రనాథ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వాస్తవాలను తెలుసుకోకుండా, బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా మధురవాడ సబ్ రిజిస్ట్రారు టి.తారకేష్‌ను డీఐజీ రవీంద్రనాథ్ బదిలీ చేశారు. ప్రాథమిక ఆధారాల పరిశీలన అనంతరం డీఐజీ రవీంద్రనాథ్‌ను సస్పెండ్ చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు బుధవారం ప్రకటించారు.