iDreamPost
android-app
ios-app

పెగాసస్ పై సుప్రీం జోక్యం.. కేంద్రానికి చిక్కులు తప్పవా?

  • Published Aug 05, 2021 | 10:07 AM Updated Updated Aug 05, 2021 | 10:07 AM
పెగాసస్ పై సుప్రీం జోక్యం.. కేంద్రానికి చిక్కులు తప్పవా?

పెగాసస్ స్పైవేర్.. ప్రస్తుతం పార్లమెంటును కుదిపేస్తున్న అంశం. వర్షాకాల సమావేశాలు మొదలై రెండు వారాలు దాటినా ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉంది. టెర్రరిస్టులపై నిఘా పెట్టేందుకు ఉపయోగించే సాఫ్ట్ వేర్ ను ప్రతిపక్ష నేతలు, మానవ హక్కుల సంఘాల నేతలపై ఉపయోగిచారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం ‘అబ్బే అలాంటిదేం లేదు. అంతా ఉత్త ముచ్చటే’ అని కొట్టిపారేస్తోంది. ‘‘పార్లమెంటు సమావేశాలు మొదలు కావడానికి కొన్ని గంటల ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారాన్ని కావాలనే తెరపైకి తీసుకొచ్చారు. ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, ఇతరుల ఫోన్ కాల్స్ హ్యాక్ చేసేందుకు ఇజ్రాయిల్ స్పైవేర్‌ ‘పెగాసస్‌’ను ప్రభుత్వం వాడుకుంటోందన్న వార్తల్లో నిజం లేదు’’ అని కొత్త కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. కానీ పెగాసస్ ఉదంతాలు ఆగడం లేదు. కొత్త పేర్లు బయట పడుతూనే ఉన్నాయి.

తాజాగా సుప్రీంకోర్టుకు చెందిన రిజిస్ట్రార్లు ఎన్‌కే గాంధీ, టీఐ రాజ్‌పుత్‌ ఫోన్‌ నంబర్లు, సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్‌ మిశ్రాకు పాత ఫోన్‌ నంబర్‌, మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ వద్ద పనిచేసే జూనియర్‌ లాయర్ తంగదురై నంబర్‌ పెగాసస్‌ జాబితాలో ఉన్నాయని ఓ వెబ్ సైట్ రాసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 17 మీడియా సంస్థలు కలిసి పెగాసస్‌ జాబితాను దర్యాప్తు చేస్తున్నాయని, ఆ జాబితాలో ఇండియాకు చెందిన 300 మంది ఫోన్‌ నంబర్లు ఉన్నాయని వెల్లడించింది. అందులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సహా చాలామంది ప్రముఖుల నంబర్లు కూడా ఉన్నాయని చెప్పింది.

సుప్రీం సీరియస్..

సుప్రీం రిజిస్ట్రార్లు, మాజీ జడ్జి తదితరుల ఫోన్ నంబర్లు పెగాసస్ స్పైవేర్ జాబితాలో ఉన్నాయని వెల్లడైన తర్వాతి రోజే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. గూఢచర్యం ఆరోపణల్లో నిజం ఉంటే.. అలాంటి చర్యకు పాల్పడటం చాలా తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. పెగాసస్ నిఘా వివాదంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజమేంటో బయటికి రావాలని, తర్వాతి విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు హాజరు కావాలని సీజేఐ స్పష్టం చేశారు. పెగాసస్ అంశంపై దాఖలైన మెజారిటీ పిటిషన్లు విదేశీ వార్త పత్రికల రిపోర్టుల ఆధారంగా దాఖలైనవేనని, ఇంకేవైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. రెండేళ్లుగా నిఘా జరుగుతున్నట్లు వార్తలు వస్తుంటే ఇప్పుడే ఎందుకు కోర్టుకు వచ్చారంటూ పిటిషనర్లను నిలదీశారు.

కేంద్రానికి చిక్కులు

పెగాసస్ స్పైవేర్ ఉచ్చు మెల్లగా కేంద్ర ప్రభుత్వం చుట్టూ బిగుస్తోంది. పెగాసస్ జాబితాలోని పేర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం, ప్రతిపక్షాల ఆందోళనలు ఎక్కువ అవుతుండటంతో మోడీ సర్కారుకు చిక్కులు తప్పేలా లేవు. తాము ఎలాంటి నిఘా పెట్టలేదని కేంద్రం చెబుతుంటే.. జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆక్సిజన్ కొరత వల్లే దేశంలో ఎవరూ చనిపోలేదని కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాటల్లో ఎంత నిజముందో.. ఇప్పుడు పెగాసస్ స్పైవేర్ తో గూఢచర్యం చేయలేదన్న మాటల్లోనూ అంతే నిజముందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టమేం లేకున్నా.. రానున్న రోజుల్లో ఇది ముదిరితే మాత్రం చిక్కులు తప్పవు. అయితే ఒక్కటి మాత్రం నిజం.. పెగాసస్ అంశం తెరపైకి వచ్చాక.. మిగతా అంశాలన్నీ పక్కకి పోయాయి. పార్లమెంటులో నిరసనల మధ్యే బిల్లులన్నింటినీ ఆమోదించుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతికూల పరిస్థితుల్లోనూ కావాల్సింది చేసుకోవడం అంటే ఇదేనేమో..!