మరో నాలుగు రోజుల్లో పదవి విరమణ చేయబోతోన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ మరో కీలక తీర్పు వెలువరించారు. ఇటీవల అయోధ్య సమస్యకు పరిస్కారం చూపిస్తూ తీర్పు వెలువరించిన చీఫ్ జస్టిస్ నేడు సమాచార హక్కు చట్టం ఉన్నతిని పెంచేలా మరో తీర్పు ఇచ్చారు. చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా (సిజెఐ) కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధి లోకి వస్తుందని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. తాజా తీర్పు తో 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది.
సీజేఐ కార్యాలయం ఆర్ టి ఐ పరిధిలోకి వస్తుందని 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్ట్ సెక్రటరీజనరల్, కోర్టు కు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ నిర్వహించిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వులో ఉంచింది.
తాజా తీర్పు ఫలితంగా సుప్రీం కోర్టు జడ్జీల సమాచారం కూడా పౌరులు తెలుసుకునే అవకాశం వచ్చింది. 2010 లో ఢిల్లీ కోర్టు తీర్పును అప్పటి సుప్రీం చీఫ్ కె.జి. బాలకృష్ణన్ వ్యతిరేకించారు. ఈ విషయంపై యస్సి అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
గతంలో న్యాయ వ్యవస్థ పై ప్రశాంత్ భూషణ్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. 95 శాతం జడ్జీలు అవినీతి పరులని ఆరోపించారు. తన ఆరోపణలు తప్పని భావిస్తే తనకు ఏ శిక్ష వేసినా తాను సిద్ధమేనని సవాల్ చేశారు. అయితే ప్రశాంత్ భూషణ్ ఆరోపణలను ఏ ఒక్క న్యాయమూర్తి ఖండించకపోవడం గమనార్హం. ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యలతో అప్పటి వరకు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడగూడదన్న అపోహలను పటాపంచలు చేసారు.