Idream media
Idream media
తమిళనాడు రాజకీయాలు స్టార్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడే కాదు.. దశాబ్దాల తరబడి అదే ఒరవడి కొనసాగుతోంది. రాజకీయ రంగుల రాట్నంలో నటులే ఎక్కువగా కనిపిస్తారు. నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకూ ఎందరో ప్రముఖులు రాజకీయ యువనికపై సంచలనంగా మారారు. రంగుల లోకం నుంచి రాజకీయ లోకంలో అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. యువ నటులు విశాల్, విజయ్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాల్ ప్రకటన చేయగా.. తాజాగా విజయ్ సైతం అభిమానులతో సమావేశంలో భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయాల్లోకి వచ్చే సినీ నటుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కమల్‌హాసన్ రాజకీయ పార్టీని ప్రారంభించగా, రజనీకాంత్ కూడా జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయరంగాన్ని ఓ సారి పరిశీలిస్తే ఎందరో అగ్రశ్రేణి నటుల మెరుపులు – మరకలు కనిపిస్తాయి.
నాటి అన్నాదురై నుంచి నేటి రజనీకాంత్ వరకూ…
అన్నాదురై.. తమిళనాట అన్నగా పిలిచే సి.ఎన్. అన్నాదురై (కంజీవరం నటరాజన్) నాటక రచయిత. ద్రవిడ కళగం(డీకే) కీలక వ్యక్తులలో ఒకరు. పెరియార్ (ఈవీ రామస్వామి)తో విభేదాల కారణంగా ద్రవిడ కళగం నుంచి బయటకు వచ్చారు. డిఎంకే (ద్రవిడ మున్నేట్ర కళగం) పేరుతో 1949లో పార్టీ స్థాపించారు. తర్వాత కాలంలో కరుణానిధి, ఎంజీఆర్ ఈ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. తమిళ అభిమానుల అండతో రాజకీయాల్లో రాణించిన ఎంజీఆర్.. డిఎంకేలో వారసత్వ పోరుతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు ఎంజీ రామచంద్రన్. పార్టీ నుంచి బయటకొచ్చి 1972 అక్టోబర్ 17న ఆలిండియా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐడీఎంకే) పార్టీని స్థాపించారు. 1977లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడంతో ముఖ్యమంత్రిగా ఎంజీ రామచంద్రన్ బాధ్యతలు చేపట్టారు. ఇదే ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో విభేదాలు రావడంతో నటి జయలలిత అన్నాడీఎంకే పార్టీని చేతుల్లోకి తీసుకుంది.1989 నుంచి 2016లో చనిపోయేవరకు పార్టీని నడిపించారు జయలలిత. తమిళనాట ఏఐడీఎంకే అత్యధికంగా ఏడుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుంది. చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చరిత్ర ఆమె సొంతం.
తమిళనాట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నటుల్లో శివాజీ గణేషన్ ఒకరు. డీఎంకే పార్టీ తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత తమిళగ మున్నెట్ర మున్ననై పేరుతో సొంతగా పార్టీ నెలకొల్పారు. 1989 ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శివాజీ గణేశన్ కూడా తిరువాయిర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పార్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి.. కార్యకర్తలను జనతాదళ్‌లో చేరాలని సూచించారు.
రాజకీయాల్లోకి వచ్చిన మరో తమిళ సినీనటుడు విజయ్ కాంత్ .. 2005లో దేశియ ముర్పోర్కు ద్రవిడ కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2006 ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లోనూ ఆ పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్కరు మాత్రమే గెలుపొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. 29 సీట్లలో గెలుపొంది జయలలిత ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అయితే, 2014 ఎన్నికల్లో 104 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది విజయకాంత్ పార్టీ. మరో తమిళ నటుడు కార్తీక్ 2006లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో ఆలిండియా నాదులమ్ మక్కల్ కట్చీ పేరుతో పార్టీని సైతం స్థాపించారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్ నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. టి.రాజేంద్రన్ ఆలిండియా లట్చియ ద్రవిడ మున్నెట్ర కళగం పేరుతో పార్టీని స్థాపించగా, శరత్ కుమార్.. ఆలిండియా సమత్తువ మక్కల్ కట్చీ( ఏఐఎస్ఎంకే) పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు.
తొలుత కమల్.. తర్వాత తలైవా…
తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగారు. మరో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. బెంగళూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరో తమిళ హీరో విజయ్… ‘ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయ్యక్కమ్’ అనే పార్టీని విజయ్ పేరిట ఆయన తండ్రి ఏర్పాటు చేశారు. అయితే , ఈ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ చెబుతూ వచ్చారు. తాజాగా తమిళ తలైవా రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని వెల్లడించారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. పార్టీ నిర్మాణం, జెండా, ఎజెండా , ఎన్నికల గుర్తు తదితర అంశాలన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి
తాజాగా విజయ్..?
నటుడు విజయ్ కూడా అభిమానులకు తీపి కబురందించారు. రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లు నోరు మెదపని ఆయన ఎట్టకేలకు ఆదివారం తమ అభిమానులను సంతృప్తిపరిచే ప్రకటన చేసినట్లు తెలిసింది. తన రాజకీయ రంగప్రవేశం జాప్యంపై అసంతృప్తితో ఉన్న అభిమానులెవ్వరూ ఇతర పార్టీల్లోకి వెళ్లొద్దని, తన అభిమాన సంఘం ‘మక్కల్ ఇయక్కం’ నుంచి వైదొలగరాదని విజ్ఞప్తి చేశారు. ‘ఎంతో సహనంతో ఇన్నేళ్లుగా ఎదురు చూసిన మీ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఎవ్వరూ అధైర్యపడొద్దు’ అని సందేశం పంపారు. చెన్నై శివారు పనయూరులోని ఫాంహౌస్‌లో ఆదివారం మక్కల్ ఇయక్కం నేతలు, అభిమానులతో విజయ్ సమావేశమయ్యారు. అసంతృప్తితో ఉన్న అభిమాన సంఘాల నేతలను పిలిపించి బుజ్జగించినట్లు ప్రచారం జరుగుతోంది.