Idream media
Idream media
నేను చిన్నప్పటి నుంచి బీడీలు, సిగరెట్ల పొగల మధ్యే పెరిగాను. ఆ రోజుల్లో Smoking జీవితంలో ఒక భాగం. అది తప్పని చెప్పేవాళ్లు కూడా లేరు. మా తాత గణేశ్ బీడీలు తాగేవాడు. పైసాకి ఒక బీడీ. కట్ట 20 పైసలు. 25 బీడీలుండేవి. పొయ్యిలో బీడీ వెలిగించుకుని రమ్మని పంపేవాడు. నేను బీడీ వెలిగించి నోట్లో పెట్టుకునే వాన్ని. కానీ గాలిని ముందుకు ఊదేవాన్ని. వెనక్కి లాగితే పొగ వస్తుందని తెలీదు.
ఐదో తరగతి మా పల్లెలో చదివా. రఘు అనేవాడు ఒకసారి సిగరెట్ ఇచ్చి లాగమన్నాడు. పొగకి ఉక్కిరిబిక్కిరయ్యా. తర్వాత కాగితాలు చుట్ట చుట్టి వెలిగించి పొగ పీల్చడం, జొన్న దంట్లు అంటించి పొగని లాగడం అలవాటైంది. అదంతా నోరు చేదు, దగ్గు వ్యవహారం.
అప్పట్లో సినిమాల్లో హీరోలు కూడా స్టైల్‌గా సిగరెట్లు ఊదేవాళ్లు. పొగతాగడం హానికరమని సినిమాల్లో కనపడని కాలం. NTR ANR విచిత్రంగా తాగేవాళ్లు. కృష్ణకి సిగరెట్ తాగడం కూడా రాదు. దేవదాసు సినిమాలో సిగరెట్ తాగి దగ్గితే జనం పారిపోయారు.
నేను, శేఖర్ , మల్లికార్జున కలిసి ఒకరోజు రహస్యంగా బీడీలు తాగాలని ప్లాన్ వేశాం. ఊరి బయట ఉన్న అజీజీయా టాకీస్ వరకూ వెళ్లాం. జేబులో పావలా ఉంది. భయంగా 10 పైసలు బీడీలు కొన్నాం. అవి తాగాలంటే అగ్గి పెట్టె కావాలి, అది కొనలేదు. అక్కడ ఉన్న ఆరిపోయిన కొలిమిలో అంటించాం. పొగ పరమ చెత్తగా ఉన్నా, ఏదో హీరోలయిపోయిన ఫీలింగ్.
9వ తరగతి వచ్చే సరికి అలవాటు పెరిగి , భయం పోయింది. మా సీనియర్ చెన్నవీర రింగులు రింగులు పొగ ఎలా వదలాలో కూడా నేర్పించాడు. ఇదంతా అపుడపుడే తప్ప రోజూ కాదు.
యూనివర్సిటీకి వచ్చే సరికి రోజూ అలవాటైంది. గోల్డ్‌ఫ్లాక్ కింగ్ 40 పైసలు ఉండేది. ఎక్కువ తాగాలన్నా డబ్బులు లేని కాలం.
జర్నలిస్టుగా ఉద్యోగం వచ్చింది.
1988లో నేను ఆంధ్రజ్యోతి తిరుపతి ఆఫీస్‌లో అడుగు పెట్టినప్పుడు అదొక పొగబండిలా కనిపించింది. న్యూస్ ఎడిటర్ కృష్ణమూర్తి గారు , నారాయణరావు గోపరాజు (ఇప్పుడు జాగృతి ఎడిటర్), వాసుదేవన్ , కొత్వాల్ అమరేంద్ర వీళ్లు మినహాయించి అందరూ స్మోకర్సే. ఐటెం రాస్తున్నప్పుడు సిగరెట్ వెలిగించి దీర్ఘంగా ఆలోచించే వాళ్లు.
ప్రముఖ రచయిత నామిని రాసేది తక్కువ, సిగరెట్లు తాగేది ఎక్కువ, కొని తాగడం మరీ తక్కువ. సౌదా ఐటెం రాసేటప్పుడు చెక్కుతున్నట్టు భావించి సిగరెట్లు ఊదేవాడు. ఆర్ఎం ఉమామహేశ్వరరావు తక్కువ తాగేవాడు. ఆయన అన్నింట్లోనూ మితమే. అందుకే తక్కువ కథలు రాశాడు.
మేర్లపాక మురళికి సిగరెట్లు తాగడమే ఒక ఉద్యోగం. సిగరెట్లు సంఖ్యను తగ్గించాలని, ఎక్కువ తాగేస్తున్నాననే ఫీలింగ్‌తో ఒక బ్లేడ్‌తో సిగరెట్‌ను కత్తిరించి తాగేవాడు. కానీ ఎప్పుడూ బ్లేడ్ కోసం వెతుక్కుంటూనో, సిగరెట్‌ని కట్ చేస్తూనో ఉండేవాడు.
నేను కొత్తగా చేరినప్పుడు కొంత బిడియపడినా, తర్వాత అగ్గిరాముడై పోయాను. మంచి ఐటెం రాయాలంటే ఒక సిగరెట్ పడాల్సిందే అనే అభిప్రాయాల్ని మా సీనియర్ జర్నలిస్టులెందరో సృష్టించడం వల్ల మేమూ దాన్ని ఫాలో అయిపోయాం.
నెల్లూరు నుంచి రమణయ్య అని ఒక రిపోర్టర్ వచ్చేవాడు. వస్తూ వస్తూ నాలుగైదు డన్‌హిల్ సిగరెట్ పెట్టెలు తెచ్చేవాడు. నెల్లూరు డెస్క్ వాళ్లకి ఎక్కువగానూ, మిగతా వాళ్లకి తక్కవగానూ పంచేవాడు. నేను తీసుకున్న మొదటి లంచం రమణయ్య డన్‌హిల్ సిగరెట్.
రోజులు ఒక్కలాగా ఉండవు. జర్నలిస్ట్‌ల మనోధైర్యాన్ని , ఆర్థిక స్థితిని దెబ్బతీస్తూ 2000 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి మూతపడింది.
2002లో తెరిచారు. కంప్యూటర్ యుగం మొదలైంది. సిగరెట్లు బంద్. తాగాలంటే ఆఫీస్ బయటికెళ్లి తాగాల్సిందే. దాని వల్ల ఎక్కువ సార్లు బయటికి వెళ్లాల్సి వచ్చేది.
2007లో సాక్షిలో చేరాను. స్మోక్ చేయాలంటే బయటికి రావాల్సిందే. డ్యూటీ నుంచి ఇంటికి వెళుతూ తిరుపతి బస్టాండ్‌లో సిటింగ్ వేసేవాళ్లం. మిత్రులు నరేంద్రరెడ్డి, సుధాకర్‌బాబులతో కలిసి తెల్లారే వరకూ టీ, సిగరెట్లు , చర్చలు.
స్మోకింగ్ మానేద్దామని ఎన్నోసార్లు మానేశా. కొన్నిసార్లు వారం, నెల, రెండు నెలలు మళ్లీ స్టార్ట్ అయ్యేది. 2010లో విజయం సాధించా. మళ్లీ తాగలేదు. నిజానికి రాయడానికి , స్మోకింగ్‌కి ఏ సంబంధమూ లేదు. 2011 తర్వాతే నేను ఎక్కువగా రాశాను.
కొత్తగా జర్నలిజంలోకి వస్తున్న వారిలో ఎక్కువ మందికి స్మోకింగ్ అలవాటు లేదు. అదో సంతోషం.
అత్యంత వికారంగా ఉన్న బొమ్మని పెట్టె మీద వేసినా ఇపుడు తాగేస్తున్నారు. మా కాలమే మేలు. సిగరెట్ పెట్టెలు అందంగా ఉండేవి.
ఇదెంత పాడు అలవాటంటే , పదేళ్ల తర్వాత కూడా మళ్లీ సిగరెట్లు స్టార్ట్ చేసిన కలలొస్తాయి.