iDreamPost
android-app
ios-app

చిరు చెప్పిన పెద్ద పాఠమదే, టాలీవుడ్ పెద్దలతో పాటుగా సినీ రాజకీయులకు ఇదో గుణపాఠం

  • Published Jan 14, 2022 | 2:26 AM Updated Updated Mar 11, 2022 | 10:24 PM
చిరు చెప్పిన పెద్ద పాఠమదే, టాలీవుడ్ పెద్దలతో పాటుగా సినీ రాజకీయులకు ఇదో గుణపాఠం

మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘకాలం పాటు టాలీవుడ్ ని మకుటం లేని మహారాజుగా ఏలేశారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఓ స్థాయికే పరిమితమయ్యారు. సీఎం పీఠం కోసం సొంతంగా పార్టీ పెట్టి రంగంలోకి దిగినా రాణించలేకపోయారు. కేంద్ర మంత్రి పదవి స్థాయి వరకూ చేరినా తన కల మాత్రం నెరవేర్చుకోలేక పోయారు. అయినప్పటికీ తన స్థాయి గుర్తెరిగి ఆయన రాజకీయాలు విరమించుకున్నారు. హూందాతనం వీడకుండా వివిధ సందర్భాల్లో వ్యవహరిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో కొందరు ఏపీ ప్రభుత్వంతో తగాదా పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాల విషయంలో కూడా చిరంజీవి ముందుచూపుతో వ్యవహరించారు. తాను ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెబుతూనే పెద్ద మనసుతో వ్యవహరించారు. పరిశ్రమలో తన ప్రాధాన్యతను మరోసారి చాటుకున్నారు.

సినీరంగంలో చాలామందికి ఏపీ రాజకీయాల్లోని జగన్ పోకడ గిట్టడం లేదనడంలో సందేహం లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధాలు కావచ్చు, అమరావతిలో ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, కులం సహా వివిధ కారణాలు కూడా ఉండొచ్చు. అయినా గానీ ప్రభుత్వంతో ఢీకొట్టేందుకు కొందరు కుతూహలం చూపడం ఇండస్ట్రీలో అందరినీ ఇబ్బందులపాలుజేస్తోంది. సామరస్యంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో కూడా నోటికి పనిచెబుతున్న వారి తీరు చాలామందికి శిరోభారం అవుతోంది. ముఖ్యంగా భారీ పెట్టుబడులతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా సమస్య పరిష్కరించుకునే దిశలో ఆలోచించడానికి బదులుగా పెద్దది చేసేందుకు దోహదపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కలిసి తెలుగు నేల మీద ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు టాలీవుడ్ కి తలనొప్పిగా తయారయ్యాయి.

వర్తమాన పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వంతో చర్చించి, సమస్యలు తీర్చుకోవడం కన్నా ఉత్తమ మార్గం లేదు. ఇది అందరూ అంగీకరించే సత్యం. కానీ ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకొచ్చే వారే కరువయ్యారు. ఆ సమయంలో చిరంజీవి తీసుకున్న చొరవ ఇప్పుడు టాలీవుడ్ వర్గాలకు పెద్ద పాఠంగా చెప్పాలి. చిరంజీవి నేరుగా సీఎం జగన్ తో భేటీ తర్వాత మాట్లాడిన తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి ఎంత సహృదయంతో స్పందించారో తెలుస్తోంది. సమస్యలను ఎంత కూలంకశంగా తెలుసుకున్నారో తేటతెల్లమవుతోంది. అందుకే చిరంజీవి కూడా సమస్య తీరుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ఇది చిరు తీసుకున్న చొరవ కారణంగా అందరకీ పెద్ద పాఠం అవుతుంది.

ఏపీ ప్రభుత్వం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలకు శ్రీకారం చుడుతన్న దశలో పరిశ్రమ కూడా దానికి సహకరించడం శ్రేయస్కరం. మధ్యేమార్గంగా ఇరువర్గాలకు ఇబ్బంది లేకుండా పరిష్కారం చూడడం ఉత్తమం. దానికి బదులుగా ప్రభుత్వంతో పోట్లాడుదామనేందుకు సిద్ధపడితే చివరకు టాలీవుడ్ వర్గాలకే పెను నష్టం వస్తుంది. అది తెలుసు కాబట్టే చిరంజీవి చర్చలకు దిగారు. సమస్యను పరిష్కరించే మార్గంలో ఓ అడుగు వేశారు. చాలామంది టాలీవుడ్ రాజకీయుల మాదిరిగా వివాదం పెంచడానికి కాకుండా అది సమసిపోయేలా చేసేందుకు ఈ ప్రయత్నం ఓ సానుకూల సంకేతంగా ఉంది. చాలామంది టాలీవుడ్ రాజకీయాలకు అది గుణపాఠం అవుతుంది. ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సఖ్యతగా ఉండాలే తప్ప సామరస్య వాతావరణం చెడగొట్టుకుంటే చివరకు సినీ రంగమే చెడిపోతుందనే అంశాన్ని చిరంజీవి చెప్పకనే చెప్పారు. ఎవరూ నోరు పారేసుకోకండి అంటూ చెప్పిన మాటలు గుర్తుంచుకోవాల్సిన అవసరముంది.

గతంలో చిరంజీవి పట్ల కొందరు చిన్నచూపు చూసేలా మాట్లాడినా ఇప్పుడు చిరంజీవి పరిశ్రమకు పెద్దదిక్కుగా మారారు. తాను పెద్దని కాదని ఆయన చెప్పినప్పటికీ సమస్యను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నమే ఆయనకి పెద్దరికం తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌ వంటి వారు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తననేదో చేసేందుకే అన్నట్టుగా భ్రమల్లో ఉన్న తరుణంలో చిరంజీవి మొత్తం అందరికీ సంబంధించిన అంశంగా దానిని డీల్ చేస్తున్న తీరు ఆ ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో చెబుతోంది. సమస్యను విస్తృతంగా ఆలోచిస్తే ఎలా పరిష్కరించవచ్చో చిరంజీవి చెప్పినట్టయ్యింది. ఏమయినా తాజాగా చిరంజీవి, సీఎం జగన్ భేటీ తెలుగు సినీరంగంలో సంతృప్తి కలిగించే దిశగా ఉంటుందనే అభిప్రాయం కలిగించింది.