Idream media
Idream media
సినీ నటులుగా ప్రజాభిమానం పొంది..తద్వారా రాజకీయాల్లో రాణించిన వారు కొందరైతే.. విఫలమైన వారు మరికొందరు. విఫలమైన వారిలో తెలుగు సినీ నటులు చాలా మంది ఉన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకూ విఫలమైన వారి జాబితాలో ఉన్నారు. రాజకీయాలకు విరామం ప్రకటించి.. మళ్లీ సినిమాల వైపు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. ఏ పార్టీలో ఉన్నారు..? అనే ప్రశ్న ఆయన అభిమానులను చాలా కాలం నుంచి వెంటాడుతోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి.. కేంద్రంలో మంత్రి పదవిని చేపట్టిన చిరంజీవి.. ఆ పదవి కాలం ముగిసిన తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా..? లేదా..? అనే ప్రశ్నకు ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది.
చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జి ఉమెన్ ఛాందీ చెప్పడంతో మెగాస్టార్ రాజకీయ పయనంపై స్పష్టత వచ్చింది. 2008లో ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన చిరంజీవి.. ఒంటరిగా పోటీ చేసి దాదాపు 15 శాతం ఓట్లు, 18 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. వరుసగా రెండోసారి వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ముఖ్యమంత్రి కావాలనే చిరంజీవి ఆశలు నెరవేరలేదు. పార్టీ అధికారంలోకి రాలేకపోవడం, నేతలను, పార్టీని నడిపించడం కష్టంగా మారడంతో రెండున్నరేళ్ల తర్వాత ప్రజా రాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రతిఫలంగా చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంంలో మంత్రి పదవిని కట్టబెట్టింది. స్వతంత్ర హోదాలో పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి పదవీ బాధ్యలు నిర్వర్తించారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉన్నా.. ఆయన నామమాత్రపు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. 2019 ఎన్నికల్లోనూ రాజకీయంగా ఆయన స్తబ్ధుగా ఉన్నారు. సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. ఆయన అభిమానులు ఎవరికి వారు తమకు నచ్చిన పార్టీకి మద్ధతు తెలిపారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చిరంజీవి రాజకీయంగా యాక్టివ్ అవుతారనే ప్రచారం సాగింది. రాజ్యసభకు ఆయన వెళతారనే చర్చ కొద్దిరోజులపాటు సాగింది. అయితే అది ఒట్టి ప్రచారమేనని తేలిపోయింది. అయితే ఇన్నాళ్ల తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌లో కొనసాగడంలేదని ఆ పార్టీ పెద్దలు క్లారిటీ ఇవ్వడం ప్రస్తుతం ఆసక్తికరం.
Also Read : దేశంలో ఒకరికొకరు.. యూపీలో ఎవరికివారు