తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఆయనను తాడేపల్లి నివాసంలో కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన తర్వాత వైఎస్ జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు తనకు బాగా నచ్చాయని ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల విషయంలో కూడా ఆయన సానుకూలంగా స్పందించారని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా వెల్లడించారు. మా ఇద్దరి చర్చలు సఫలమయ్యాయి అని పేర్కొన్న చిరంజీవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పేదలకు ఉపయోగకరంగా ఉన్నాయని, సినీ పరిశ్రమ ఇబ్బందుల విషయంలో జగన్ తమకు హామీ ఇచ్చారని జగన్ తో మాట్లాడిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే ఎక్కడ మొదలైందో ఎలా మొదలయిందో తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ తరఫున జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి వైసీపీ తరఫున రాజ్యసభకు వెళితే ఎలా ఉంటుంది? ఆయన ఆ ఆఫర్ ఒప్పుకుంటారా? అంటూ అనేక చర్చోపచర్చలు జరుగుతూ వస్తున్నాయి. దీని మీద పలువర్గాల నుంచి పలురకాల స్పందనలు వస్తున్నాయి. నిజానికి కొన్ని రాజ్యసభ సీట్లు త్వరలో ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలోనే ఈ చర్చ మొదలైంది.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ విషయం మీద స్పందించారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలు పక్క దోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి, అవన్నీ పూర్తిగా నిరాధారం అని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాల్లోకి ,చట్టసభలకు రావడం జరగదు. దయ చేసి ఊహాగానాలు వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలు,చర్చలు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. వార్తలు ప్రసారం చేయండి కానీ మీ ఉద్దేశాలు కాదంటూ ఆయన చెప్పుకొచ్చారు.