ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ది ప్రత్యేక పాత్ర. 15 ఏళ్ల క్రితమే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా పర్సనల్ గానూ, పార్టీ గానూ విజయం సాధించలేని నేతగా ఆయన మిగిలిపోయారు. అయితే సినిమా ఛరిష్మాతో జనంలో ఉన్న ఆదరణను సొమ్ము చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. తొలుత ప్రజారాజ్యంలో యువజన విభాగం అధినేతగా ప్రస్థానం ప్రారంభించి, తర్వాత జనసేనతో సొంత జెండా తయారు చేసుకున్నప్పటికీ ఆయనకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం మాత్రం రాలేదు. దాంతో వచ్చే ఎన్నికల కోసం బీజేపీతో కలిసి ఆయన సాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పలుమార్లు బీజేపీ నేతలు తమ మాటను బేఖాతరు చేస్తున్నా ముందుకు సాగుతున్నారు.
హఠాత్తుగా జనసేన నేతలు చిరంజీవి జపం అందుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి రాబోతున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అండగా ఉండేందుకు చిరంజీవి సన్నద్ధమవుతున్నారని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. జనసేనలో ప్రస్తుతం పవన్ , ఆతర్వాత నాదెండ్ల మాత్రమే నేతలు. ఈ ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలుకావడం, నాదెండ్ల మనోహర్ అయితే మూడోస్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.
ఇక హఠాత్తుగా చిరంజీవిని తెరమీదకు తీసుకురావడానికి జనసేన ప్రయత్నం చేయడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి ఇటీవల చిరంజీవి రాజకీయంగా తన మనసులో మాటలను పలుమార్లు బయటపెట్టారు. సినిమాలకే పరిమితం అయినప్పటికీ గడిచిన ఏడాది కాలంలో ఆయన రెండు సార్లు సీఎం జగన్ ఇంటికి వచ్చారు. ముఖ్యమంత్రి ఇంట్లో విందు ఆరగించారు. ఆ తర్వాత కూడి జగన్ కీలక నిర్ణయాలను సమర్థించారు. మూడు రాజధానుల ఆవశ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా బాగుటుందని తెలిపారు. తద్వారా పాలనా వికేంద్రీకరణ ఎంతో ప్రయోజనమని మాజీ కేంద్రమంత్రిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశాలయ్యాయి. పవన్ అమరావతి కోసం ఆరాటపడుతుంటే, చిరంజీవి మాత్రం విశాఖకి విజిల్ వేయడం విశేషం.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రయత్నించినా జనసేన గాడిలో పడే అవకాశం కనిపించడం లేదు. కేవలం పవన్ చుట్టూ పరిభ్రమించే ఆపార్టీ రాజకీయాల్లో పెద్దగా రాణించే అవకాశం లేదనే అభిప్రాయం బలపడుతోంది. దాంతో గతంలో సొంత పార్టీ పెట్టి, కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిని ముందుకు తీసుకురావడం చర్చకు తెరలేపింది. పవన్ పాపులారిటీ పడిపోతున్న తరుణంలో జనసేనని నిలబెట్టుకోవడానికి చిరంజీవిని ముందుకు తెస్తున్నారా అనే అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో బీజేపీ నేతలు చిరంజీవి మీద పదే పదే ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఆయనే జనసేన ద్వారా బీజేపీ పక్షాన చేరేందుకు సిద్ధమవుతున్నారా అనే చర్చ ప్రారంభమయ్యింది.
వరుసగా నాలుగు సినిమాలకు సిద్ధపడి, త్వరలో ఆచార్య సహా వాటన్నింటినీ పూర్తి చేసే పనుల్లో ఉన్న చిరంజీవి మీద బీజేపీ నేతల ఒత్తిడి చాలాకాలంగా ఉంది. కానీ ఇప్పుడు జనసేన పేరు ముందుకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 2009 ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఎవరిదారి వారిదే అన్నట్టుగా సాగుతున్న అన్నదమ్ములు మళ్లీ ఒకే గూటికి చేరుతారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అది సాధ్యం కాకపోవచ్చని, కేవలం జనసేన శ్రేణుల్లో నిరుత్సాహం పెరుగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికల్లో బూస్టింగ్ కోసం ఇలాంటి ఎత్తులు వేసి ఉంటారని సందేహిస్తున్నారు.