Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ బారిన పడే ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారిన పడగా.. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌కు వైరస్ సోకగా ఆయన కూడా హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారు. లాక్‌డౌన్ సమయంలో కరణం వెంకటేష్ చీరాలలో నిత్యం ప్రజా సేవలో పాల్గొన్నారు. అన్నార్తులకు ప్రతి రోజు అన్నదానం చేశారు. ఎవరైనా ఆహారం కావాల్సి వస్తే నేరుగా ఆయనకు ఫోన్ చేస్తే ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వెంకటేష్ వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. అతని ద్వారా బలరాంకు వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడ్డారు. శృంగవరపు కోట, కోడుమూరు, కడప, శ్రీశైలం, పొన్నూరు, సూళ్లూరుపేట, సత్తెనపల్లి ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డారు. వీరిలో శృంగవరపు కోట, కోడుమూరు, కడప ఎమ్మెల్యేలు కోలుకోగా.. మిగతావారు చికిత్స తీసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా వైరస్ నుంచి కోలుకున్నారు. నిన్న సోమవారం అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ కోన రఘుపతి దంపతులకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ బారినపడి దాదాపు నెల రోజులపాటు చికిత్స తీసుకున్నా కూడా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ప్రాణాలు కోల్పోయారు.