iDreamPost
android-app
ios-app

Chinarajappa, OTS – చంద్రబాబు మొదటి సంతకం ఓటీఎస్‌పైనేనట!

  • Published Dec 27, 2021 | 2:40 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
Chinarajappa, OTS – చంద్రబాబు మొదటి సంతకం ఓటీఎస్‌పైనేనట!

ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది టీడీపీ సీనియర్‌ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాటతీరు. సోమవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఓటిఎస్‌ రద్దుపై తమ నాయకుడు చంద్రబాబు చేస్తారని చెప్పారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 23 సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ పుంజుకున్న దాఖలాలు లేవు. అయినా మొదటి సంతకం అంటూ ఆయన చేసిన కామెంట్‌ పార్టీ శ్రేణులను సైతం ఆశ్యర్యపరిచేదిగా ఉందని చెప్పవచ్చు. ఓటిఎస్‌ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన కాకినాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటిఎస్‌ బలవంతపు వసూళ్లు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఓటిఎస్‌ పేరుతో ప్రభుత్వం వారు నియమించిన వలంటీర్లతో ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని చెప్పారు.

ప్రజలను భయపెట్టే సంస్కృతి మీదే..

ప్రజలను భయపెట్టే సంస్కృతి తమ పార్టీది కాదని, ఆ ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని వైఎస్సార్‌ సీపీ నాయకులు అంటున్నారు. వలంటీర్లతో ప్రజలను భయపెడుతున్నారని రాజప్ప చేసిన వ్యాఖ్యలను వారు తప్పు పడుతున్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొన్న చరిత్ర టీడీపీది అని వారు గుర్తు చేస్తున్నారు. రాత్రికి రాత్రి ఇళ్ల మీద దాడి చేసి బెదిరించడం, పంట పొలాలను తగులబెట్టి రైతులను భయపెట్టడం వంటి దుశ్చర్యలతో  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రైతుల నుంచి భూములను లాక్కొందని చెబుతున్నారు. పోలీసుల సాయంతో వైఎస్సార్‌ సీపీ నేతలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వంటి వారిని అక్రమంగా నిర్బంధించడం, భయపెట్టడం టీడీపీ ప్రభుత్వం చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని దాష్టీకాలు జరుగుతున్నా హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప అప్పట్లో ఎందుకు నోరు మెదపలేదని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

నిజంగా ఓటీఎస్‌ పేరిట బలవంతపు వసూళ్లు జరిగితే, వలంటీర్లు ప్రజలను భయపెడుతుంటే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాలన్న సంగతి హోంమంత్రిగా పనిచేసిన చినరాజప్పకు తెలియదా? అని అడుగుతున్నారు. వలంటీరు వ్యవస్థపై జనంలో గౌరవం ఉందని, వారు వివిధ ప్రభుత్వ పథకాల అమలులో  ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని ఈ విషయం తెలియకుండా విమర్శలు చేయడం చినరాజప్ప అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని వైఎస్సార్‌ సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
 
బాబు సంతకం అంటే జనం నమ్ముతారా?

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చరిత్రలేని చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో గెలిచి, ఓటీఎస్‌ రద్దుపై మొదటి సంతకం చేసి, తమకు ఉచితంగా ఇళ్లు ఇస్తారు అంటే జనం నమ్ముతారా అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటివి బాబు అటకెక్కించారు. పేదల ఇంటి రుణాలపై వడ్డీని మాఫీ చేయమని ముఖ్యమంత్రిగా ఉన్న బాబుకు ఎన్నిసార్లు అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న 630 హామీలను తీర్చలేదు సరికదా మేనిఫెస్టోనే పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. ఇంతటి చరిత్ర ఉన్న బాబు రేపు అధికారంలోకి వచ్చి మొదటి సంతకం చేసి ఇళ్లు ఇచ్చేస్తామంటే నమ్మేది ఎవరు?

అసలు అంత సీన్‌ ఉందా..

2019 ఎన్నికల్లో దెబ్బ తిన్ప టీడీపీ అప్పటి నుంచి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. తర్వాత అన్ని ఎన్నికల్లో ఓడిపోయింది. అలాంటి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని, ఆ పార్టీకి అంత సీను లేదని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో, లోకేశ్‌ మంగళగిరిలో గెలవడం ఎలాగో ఆలోచించుకుంటే మంచిదని, అంతేగాని ఏకంగా మొదటి సంతకం అంటూ స్టేట్‌మెంట్‌లు ఇస్తే జనం నవ్వుకుంటారని అధికార పక్ష నేతలు రాజప్ప వ్యాఖ్యలను తూర్పార పడుతున్నారు.