Idream media
Idream media
భారత్-చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గించడంలో ముందడుగు పడింది. గత వారం రోజులుగా డ్రాగన్ దేశంపైన భారత్ పెట్టిన ఒత్తిడి ఫలించినట్లే కనిపిస్తుంది.
ఇక వివరాలోకి వెళితే వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద జూన్ 15 న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. కాగా చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అనంతరం వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇరుదేశాలు భారీ సంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు.
దీంతో భారత్-చైనా సరిహద్దులో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులను చక్కబెట్టేందుకు ఇరుదేశాల కమాండర్ స్థాయి సైనికాధికారులు జూన్ 22న మూడోసారి భేటీ అయ్యారు. దాదాపు 12గంటలపాటు జరిగిన చర్చలలో వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు బఫర్ జోన్ నిర్ణయించాయి. దీని ప్రకారం గాల్వన్ లోయ, గోగ్రా-హాట్‌స్ప్రింగ్, పాంగాంగ్ సరస్సు వద్ద ఇరు దేశాల సైన్యాలు ప్రస్తుత స్థానం నుంచి కనీసం 2.5 నుంచి 3 కిలోమీటర్ల మేర వెనక్కువెళ్లాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనకు కట్టుబడి ఉండాలని భారత్ చైనాకు స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టేందుకు ఆ దేశానికి చెందిన 59 యాప్స్‌ని నిషేధించడం, చైనా కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేసుకోవడం లాంటి చర్యలకు కేంద్రం పూనుకుంది. పైగా పాకిస్థాన్ మినహా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి పలు దేశాలు భారత్‌కి మద్దతు ప్రకటించడంతో అంతర్జాతీయంగా చైనా ఏకాకి అయింది.
అలాగే సరిహద్దులోని లద్దాఖ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా పర్యటించి చైనాపై ఒత్తిడి పెంచారు. ఆ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో విస్తరణవాద శకం ముగిసిందంటూ ముగిసిపోయిన చరిత్రని చైనా పరోక్షంగా హెచ్చరించారు.
దీంతో ఒత్తిడికి గురైన చైనా సరిహద్దు నుంచి తన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలను 1.5 కి.మీ. మేర వెనకకు తరలించింది. అంతేకాకుండా గాల్వాన్ లోయ వద్ద నిర్మించిన తాత్కాలిక గుడారాలను కూడా చైనా తొలగించినట్లు తాజాగా సైనికవర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికీ వాస్తవాధీన రేఖకు భారీగా తరలించిన ఆయుధ సామగ్రిని అక్కడే ఉంచింది. గాల్వాన్ లోయలో ఉన్న చైనా యుద్ధ సామగ్రిపై భారత సైన్యం అప్రమత్తతతో నిశితంగా పరిశీలిస్తుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో ఫింగర్ 4 నుంచి 8, గాల్వాన్ లోయ పెట్రోలింగ్ పాయింట్ 14, దెప్సాంగ్ వద్ద బాటిల్‌నెక్ నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సేనలు భారత్ వైదొలగాలని డిమాండ్ చేసింది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర తీరంలో భారత భూభాగంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చిన చైనా అది తమ భూభాగమేని వాదిస్తుంది. కానీ భారత్ మాత్రం ఏప్రిల్ ప్రారంభము నాటి యధాతథ స్థితిని ఎల్ఐసి వెంట నెలకొల్పాలని పునరుద్ఘాటించింది.
గత మే నుండి వాస్తవాధీన రేఖ వెంబడి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న చైనా తొలిసారిగా తమ సైనిక బలగాలను వెనక్కి తరలించింది.